Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సంక్షోభంలో సంక్షేమంపై అట్టుడికిన అసెంబ్లీ

. లోపలా, వెలుపలా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
. వరుసగా నాల్గవ రోజూ టీడీపీ ఎమ్మెల్యేలంతా సస్పెన్షన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఏపీలో సంక్షేమం పూర్తిగా సంక్షోభంలో పడిరదంటూ టీడీపీ శాసనసభ్యులు మంగళవారం శాసనసభ లోపలా, వెలుపలా చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు జగన్‌ రెడ్డి చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, వాహనాల విస్తృత తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులను సైతం గుర్తింపు కార్డులు చూసి వదిలారు. ఇక సంక్షోభంలో సంక్షేమం నినాదంతో టీడీపీ శాసనసభా పక్షం సభ లోపలా, బయటా నిరసన చేపట్టింది. వివిధ సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ తొలుత అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్‌ పీఎస్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్‌ విదేశీ విద్య పథకాల రద్దును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్‌ ప్లాన్‌ నిధుల పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రాకు టోకరా, కరెంట్‌ బిల్లుల ఆధారంగా పింఛన్‌ కోత తదితర అంశాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి సంక్షోభం సృష్టించిందని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కార్పొరేషన్ల రద్దుతో నయవంచన చేస్తుందంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమీపంలో టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. దళిత ద్రోహి సీఎం అంటూ ఎస్సీ సెల్‌ విభాగ నేతలు ఓ భవనం ఎక్కి ఆందోళన చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నేతలను పోలీసులు బలవంతంగా భవనం పై నుంచి దించి అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరికొందరు కార్యకర్తలు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. అతి కష్టం మీద వారినీ పోలీసులు కిందకు దింపారు. ఇక శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి అందులో సగం కూడా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాలు సగం కూడా ఇవ్వట్లేదని, వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదల పథకాలు రద్దు చేసింది. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాల పేర్లన్నీ రాసిన ప్లకార్డులు ధరించి స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతి విమర్శలకు పాల్పడ్డారు. సంక్షోభంలో ఉంది సంక్షేమం కాదని, టీడీపీయే సంక్షోభంలో ఉందంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విద్య, వైద్య రంగాల్లో చర్చ జరగాల్సి ఉందని, దయచేసి సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు దానికంటే సంక్షేమ సమస్యే ముఖ్యమంటూ చర్చకు పట్టుబట్టారు. దీంతో చివరకు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాల్సిందిగా శాసనసభ వ్యవహారాల ఇన్‌చార్జి మంత్రి ప్రతిపాదించడంతో స్పీకర్‌ సభలో ఉన్న మొత్తం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img