Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

సంఘటితమవుదాం

. మోదీ, జగన్‌ సర్కార్‌లను గద్దె దించుదాం
. వినుకొండ బహిరంగ సభలో రామకృష్ణ

విశాలాంధ్ర – వినుకొండ : వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు సంఘటితమై…2024 ఎన్నికలలో మతోన్మాద, ఆర్థిక అరాచకవాద మోదీ, జగన్‌ ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ…కార్పొరేట్‌ అనుకూల విధానాలను తిప్పికొడుతూ పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాడుదామంటూ నెల రోజులుగా చేపట్టిన ప్రచారయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ వేలాదిగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాలకుల విధానాలపై రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ సర్కారు దేశంలో మతచిచ్చు రేపి అల్లకల్లోలం సృష్టిస్తున్నదని రామకృష్ణ విమర్శించారు. ప్రజలు ఐకమత్యంగా కలిసి జీవిస్తున్న ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నదన్నారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదని ఆరోపించారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులను లూటీ చేసి విదేశాలకు పారిపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, అవినీతి రాజ్యమేలుతోందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో జగన్‌ పరిపాలన చూస్తుంటే పిచ్చోడి చేతికి రాయి అందినట్లుగా ఉందని రామకృష్ణ దుయ్యబట్టారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన రుద్దుతూ తానేదో వెలగబెట్టినట్లు ఫోజులు కొట్టడం జగన్‌ వంతైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్ర హక్కుల సాధనలో విఫలమైన జగన్‌…మోదీకి మోకరిల్లడంలో సఫలమయ్యారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్‌ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళుతున్నాయని, అమరరాజా వంటి పరిశ్రమలు జగన్‌ విధానాల కారణంగా తెలంగాణకు తరలిపోయాయని రామకృష్ణ తెలిపారు. జగన్‌ పాలనంతా కక్షసాధింపులకే పరిమితమైందన్నారు. చంద్రబాబు ఇంటిని జప్తు చేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు. జగన్‌కు పట్టిన పిచ్చే వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడుకు అంటుకున్నదన్నారు. ఆజాద్‌నగర్‌ కాలనీలో పేదల ఇంటికి విద్యుత్‌ తొలగించడం, మంచినీరు రాకుండా చేయడం వంటి పనులు ఎమ్మెల్యే స్థాయికి తగవన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావును సైతం ఇక్కడ నీకేం పని అంటూ బొల్లా బ్రహ్మనాయుడు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల్లో బొల్లా ఓటమి ఖాయమని రామకృష్ణ అన్నారు. బ్రహ్మనాయుడు పద్ధతిగా మాట్లాడాలని, అవాకులు చవాకులు పేలినా… కమ్యూనిస్టులను విమర్శించినా నాలుక కోస్తామని రామకృష్ణ హెచ్చరించారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను ఇంటికి పంపడానికి ప్రజలు సంఘటితం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారన్నారు. తూర్పు, పడమర తెలియని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కమ్యూనిస్టులను విమర్శించటం సిగ్గుచేటన్నారు. మీకు వ్యాపారాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని ముప్పాళ్ల విమర్శించారు. వినుకొండలో అన్ని వర్గాల ప్రజలు మతసామరస్యం కాపాడుతున్నారని, బ్రహ్మనాయుడు వచ్చిన వాటి నుండి ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. అకాల వర్షం వల్ల 24 వేల ఎకరాలు పంట నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోదందన్నారు. మారుతీ వరప్రసాద్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు మోదీ ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు నాయకులను వేదికపై ఆహ్వానించారు. సభలో సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రైతుసంఘం నాయకులు భూదాల శ్రీనివాసరావు, వినుకొండ మండల కార్యదర్శి భూదాల సాగర్‌బాబు, బొల్లాపల్లి కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు మహంకాళి సుబ్బారావు, మహిళా సమాఖ్య నాయకులు సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి నాయకులు గని, చంద్ర నాయక్‌, రామకృష్ణ తదితరులు ఆలపించిన గేయాలు ప్రజల్ని చైతన్యపరిచాయి. బహిరంగ సభకు ప్రజలు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img