Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

సంపన్న సీఎం జగన్‌

పేద ముఖ్యమంత్రి మమత
ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ప్రకారం ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాతం కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది. ఏడీఆర్‌ విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆస్తులు అత్యల్పంగా రూ.15 లక్షలుగా ఉన్నాయనీ, ఆమె కోటీశ్వరులైన ముఖ్యమంత్రుల జాబితాలో చోటుదక్కించుకోలేదని ఏడీఆర్‌ తెలిపింది. ప్రస్తుత 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల స్వీయ ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన తర్వాత తాము ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం…30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది(43 శాతం)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, క్రిమినల్‌ బెదిరింపులు సహా తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అవి ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే నాన్‌ బెయిలబుల్‌ నేరాలు అని నివేదిక తెలిపింది. జగన్‌మోహన్‌ రెడ్డి (రూ.510 కోట్లకు పైగా), అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా), ఒడిశాకు చెందిన నవీన్‌ పట్నాయక్‌ (రూ.63 కోట్లకు పైగా) ఆస్తులతో ఆగ్రభాగాన ఉన్నారు. ఇక ఆస్తులను అత్యల్పంగా ప్రకటించిన ముగ్గురు ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ.15 లక్షలకు పైగా), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ( కోటికి పైగా), హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ( కోటికి పైగా) ఉన్నారని ఏడీఆర్‌ తెలిపింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లకు రూ.3 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img