Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సమగ్ర ఘన వ్యర్థాల కోసం నిర్వహణ ప్లాంట్లు

ఆగస్టు 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి
వచ్చే ఏడాది జులై కల్లా ఏర్పాటుకు కార్యాచరణ
మంగళగిరి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు
చెత్త సేకరణకు 4,868 కొత్త వాహనాలు
40లక్షల ఇళ్లకు మూడు రంగుల్లో 1.20 కోట్ల చెత్తబుట్టలు
పురపాలకశాఖ సమీక్షలో సీఎం జగన్‌

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి…2022 జులై కల్లా పూర్తి చేయాలని సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో చెత్త సేకరణ కోసం 4,868 కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని, 40 లక్షల ఇళ్లకు ఇంటికి మూడు చొప్పున గ్రీన్‌, బ్లూ, రెడ్‌ కలర్లలో 1.2 కోట్ల డస్ట్‌బిన్‌లు ఇవ్వాలని, మంగళగిరి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన పురపాలకశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ పట్టణాల్లో రోడ్ల మరమ్మతులు, చెత్త సేకరణ, పొల్యూషన్‌ నివారణకు తీసుకోవల్సిన చర్యలు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఇందుకోసం ప్రభుత్వం సిబ్బందికి సమకూర్చాల్సిన పరికరాలు, వాహనాలు తదితర అంశాలపై అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. పట్టణాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే వాటి మరమ్మతులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. మూడు ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు కాలుష్య నియంత్రణ బోర్డు సిఫార్సు చేసిందని అధికారులు తెలియజేయగా, వాటిని మంగళగిరి- తాడేపల్లి మున్సిపాలిటీ, మాచర్ల, కర్నూలులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వ్యర్ధాల(చెత్త) సేకరణకు మొత్తం 4868 వాహనాలు కొనుగోలు చేయాలని, ఇందులో మొదటి దశలో 3097 కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటిలో 1771 ఎలక్ట్రిక్‌ వాహనాలుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 225 గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. సేకరించిన వ్యర్ధాల్లో 55 నుంచి 60శాతం తడిచెత్త ఉంటుంది. దీన్ని బయోడీగ్రేడ్‌ విధానంలో ట్రీట్‌ చేస్తారు.35 నుంచి 38 శాతం వరకూ పొడిచెత్త రూపంలో ఉన్న దాన్ని రీసైకిల్‌ చేస్తారు. మరికొంత మొత్తాన్ని సిమెంట్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇంకా 10-12 శాతం ఇసుక తదితర రూపంలో ఉండే దానిని ఫిల్లింగ్‌కు వాడుతారని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని, దీనివల్ల ప్రతి 2వేల మంది జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ ఆఫీసు రావడంతోపాటు ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని సీఎం జగన్‌ అన్నారు. విశాఖపట్నంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షించారు. బీచ్‌కారిడార్‌, మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌, నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. పులివెందులలో ఒక్కో మహిళ నుంచి రూ.150 చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామని అధికారులు వివరించగా, సీఎం వారిని అభినందించారు. సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img