Friday, June 2, 2023
Friday, June 2, 2023

సమరశీల పోరాటాలకు సిద్ధం

. జగన్‌ దెబ్బకు పరిశ్రమలు పారిపోతున్నాయి
. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-శ్రీకాళహస్తి : దేశంలో మోదీని గద్దె దించడమే లక్ష్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్‌ కూడలిలో గురువారం సాయంత్రం సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో ‘ప్రచార భేరి సభ’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, వి.శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, పరిస్థితులను తలచుకుంటే భయమేస్తోందన్నారు. అనేక మతాలకు, కులాలకు నిలయమైన భారతదేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ తమకు ఒకసారి అవకాశం ఇస్తే విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చి ప్రజలకు పంచి పెడతానని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. అయితే మోదీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ నల్లధనం ఎందుకు వెనక్కు తీసుకురాలేదని రామకృష్ణ ప్రశ్నించారు. దేశంలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికులు గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. వీరంతా మోదీకి స్నేహితులేనని తెలిపారు. ధరలు పెంచినా… రైతులను మోసం చేసినా… వ్యవస్థలను విధ్వంసం చేసినా మోదీని ప్రశ్నించకుండా ఆయనకు జగన్‌ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలో బుధవారం జరిగిన సభలో ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని జగన్‌ చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయాలని జగన్‌ ప్రజలకు చెప్పడం సిగ్గుగా ఉందన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని… అది ప్రభుత్వ బాధ్యతని రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీలు ఆయనకు గుర్తు లేవన్నారు. జగన్‌ పాలనలో ఉద్యోగాలు అందని ద్రాక్షగా మిగిలాయన్నారు. వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి… తాను చాలా ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, వలంటీర్లకు నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే జీతమని తెలిపారు. ఈ సొమ్ముతో వారు ఎలా కుటుంబాలు పోషించుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో జగన్‌ దెబ్బకు పరిశ్రమలు పారిపోతున్నాయని అన్నారు. తిరుపతి జిల్లాలో అమరరాజా పరిశ్రమతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఆ పరిశ్రమ నిర్వాహకులు గల్లా జయదేవ్‌ తెలుగుదేశం పార్టీ కావడంతో ఉద్దేశపూర్వకంగా వారికి నోటీసులు పంపడం… వేధించడంతో వారు తెలంగాణకు వెళ్లి రూ.10 వేల కోట్లతో పరిశ్రమ విస్తరిస్తున్నారని చెప్పారు. కేటీఆర్‌ తెలివైన వారు కావడంతో అమరరాజా వారిని ఆహ్వానించారన్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ వచ్చిందని… జగన్‌ సీఎం అయిన తర్వాత కియా వారిని వేధించడంతో వారు తమ అనుబంధ పరిశ్రమలను తెలంగాణాకు తరలించారన్నారు.
అదేవిధంగా అనంతపురం జిల్లాకు వచ్చిన జాకీ పరిశ్రమ వారు కూడా వెళ్లి పోయారన్నారు. వీటన్నిటికీ వైసీపీ నేతలే కారణం అన్నారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం వచ్చే నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య, శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, పార్టీ నేతలు కత్తి ధర్మయ్య, కత్తి రవి, మించల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img