Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

సమస్యలు పరిష్కరించకుంటే తగిన బుద్ధి చెపుతాం

. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా ధర్నా
. పెద్దఎత్తున హాజరైన ఉద్యోగ, కార్మిక సంఘాలు

విశాలాంధ్ర`విజయవాడ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు విమర్శించారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డీఏ అరియర్స్‌ వెంటనే ఇవ్వాలని, జీతాలు, పెన్షన్లు ఉద్యోగస్తులకు ప్రతి నెల ఒకటో తేదీకి చెల్లించాలని, వాడుకున్న జీపీఎఫ్‌ నిధులు వెంటనే ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ నేతృత్వంలో శుక్రవారం ఇక్కడి ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకటించినప్పుడు అరియర్స్‌ను 2022 ఏప్రిల్‌కు చెల్లిస్తామని, డీఏ బకాయిలను సంపూర్ణంగా ఇస్తామని ఓపిక పట్టాలని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చాలా గొప్పగా చెప్పిన సీఎం ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను, కార్మికులను అందరినీ పక్కాగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి మధ్య అనైక్యత, విభేదాలను సృష్టించి చరిత్రాత్మక ఆందోళనను పక్కదారి పటిస్తున్నారనీ, ఇది సరైన పద్ధతికాదని ఓబులేసు హెచ్చరించారు. గవర్నర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్లిన సూర్యనారాయణని బెదిరించి యూనియన్‌ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నిస్తూ బెదిరింపులకు దిగటం ఏ మాత్రం తగదన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగులకు మధ్యంతర భృతి కంటే తక్కువగా పీఆర్సీ ఫిట్మెంట్‌ ఇవ్వడం దారుణం అన్నారు. కొత్త పెన్షన్‌ రద్దు కోరుతూ పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనను అరెస్టుల ద్వారా అడ్డుకోవడం మూర్ఖత్వం అన్నారు. జగన్‌ ఇప్పటికైనా ఉద్యోగులతో సామరస్యంగా మెలగాలని లేదంటే రానున్న రోజుల్లో మరో తీవ్ర ఉద్యమానికి సమాయత్తం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి సంవత్సరం గడిచిపోతున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోగా సమస్యలను జఠిలం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీటీఎఫ్‌ కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రభుత్వం దగా చేసిందని ఉపాధ్యాయులందరూ కలిసి ప్రభుత్వంతో తాడోపెడో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ అరియర్స్‌ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు వెంకటరామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో పెన్షనర్లు చాలా ఇబ్బందులు గురవుతున్నారని వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెన్షనర్‌ల యూనియన్‌ జాతీయ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం జీపీఎఫ్‌ సొమ్మును వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వానికి గత ఏడాది ఇదే రోజు కార్మిక వర్గం గట్టి గుణపాఠం చెప్పిందని మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యదర్శి కేవీఎస్‌ రవి, విజయవాడ నగర ఏఐటీయూసీ కార్యదర్శి ఎం సాంబశివరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఏ.రంగనాయకులు, కోట మాల్యాద్రి, కేఆర్‌ ఆంజనేయులు శ్రామిక మహిళా సంఘం నాయకులు లక్ష్మీదేవి, శైలజ, ఏఐటీయూసీ నగర నాయకులు వియ్యపు నాగేశ్వరరావు, టీ తాతయ్య, గుంటూరు నాయకులు అరుణ్‌ కుమార్‌, చల్లా వెంకటరమణ, ఉమర్‌ వల్లి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img