Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సమాఖ్య వ్యవస్థ ధ్వంసం

పౌర హక్కులు విచ్ఛిన్నం
మోదీ దుస్తుల వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమే
విగ్రహాల పేరుతో ప్రధాని రాజకీయం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
వైసీపీ`బీజేపీ సహజీవనం: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మోదీ ప్రభుత్వ హయాంలో పౌర హక్కులు కాలరాస్తున్నారని, సమాఖ్య వ్యవస్థ(ఫెడరల్‌ సిస్టమ్‌)ను ధ్వంసం చేస్తున్నారనీ, ఈ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర వాదులంతా ఐక్యంగా పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరిభవన్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నెలకు రూ.70లక్షల విలువైన దుస్తులు ధరిస్తారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమేనని నారాయణ పునరుద్ఘాటించారు. విశ్వహిందూ పరిషత్‌ అధ్వర్యంలో నడిచే ప్రజ్ఞాభారతి ఫౌండేషన్‌ నిర్వాహకులు హనుమాన్‌చౌదరి తనపైన నేర విచారణా వ్యవహరాలు చేపడతామన్నారనీ, దాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలు అనుకున్నవేననీ, దానిపై చర్చకు సిద్ధమేనని స్పష్టంచేశారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతి రోజు, భీమవరంలో మోదీ గిరిజనులపై పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా 3లక్షల మంది గిరిజనులు అడవులను వదిలి వెళ్లిపోయారని, చాలా మందిని ఖాళీ చేయిస్తున్నారని వివరించారు. సహజ వనరుల కోసం కార్పొరేట్‌ అధినేతల ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గి గిరిజనులను, అడవులను సర్వనాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ అల్లర్లు యావత్‌ ప్రపంచానికీ తెలుసనీ, అత్యున్నత న్యాయస్థానం ఆ కేసు కొట్టివేస్తూ, న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్‌షా ఫిర్యాదుదారునిని అరెస్ట్‌ చేయాలని ఆదేశించడం దారుణమన్నారు. ఫిర్యాదిదారునిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. అక్కడలా చేస్తూ, రాష్ట్రానికి వచ్చి గిరిజనులపై ప్రేమ ఒలకబోయడం కచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. పౌర హక్కుల నేతలు వరవరరావు, సాయిబాబా తదితరులపై అన్యాయంగా కేసులు నమోదు చేసి, జైళ్లల్లో పెట్టారనీ, పౌర హక్కులకు న్యాయం చేయడమంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, మోదీ తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయన్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉందనీ, రాష్ట్రాలకు తగిన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర సహా తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. దిల్లీ, తెలంగాణపై బీజేపీ కన్ను పడిరదనీ, అందుకే ఇటీవల తెలంగాణకు మోదీ, అమిత్‌షా, కేంద్ర మంత్రులు వరుస వారీగా వచ్చి, అక్కడ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. బీజేపీవైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ఉందని, మోదీకి జగన్‌ తల, మెడ వంచి జపం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎలాంటి షరతులు లేకుండా, బీజేపీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా మద్దతివ్వడం దారుణమన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి లేకుండా, జగన్‌ తన కేసులకు భయపడి, ప్రజల గౌరవాన్ని మోదీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తూ మోదీ, అమిత్‌ షా, రాష్ట్రానికి వస్తే వారిని చూసి జగన్‌ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో ఇప్పటి వరకు 24 ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించారనీ, మరో 100 అమ్మకానికి సిద్ధమయ్యాయన్నారు. గుజరాత్‌ వాళ్లకే అన్నీ అమ్ముతున్నారనీ, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లే వాళ్లూ గుజరాత్‌ వారేనని విమర్శించారు. తీర ప్రాంతమంతా గుజరాత్‌ వాళ్లకే రాసిస్తున్నారని విమర్శించారు. మోదీకి కేసీఆర్‌ ఎదురు తిరిగినా, జగన్‌ మాత్రం ఏమి మాట్లాడటం లేదన్నారు. బొగ్గు కొనుగోలుపై కేసీఆర్‌ ఎదురు తిరిగారనీ, ఆదాని దగ్గర కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పారన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్నపాటి తప్పిదాలను మోదీ గమనించి, వాటిపై పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. ఇవాళ విగ్రహాల ఆవిష్కరణ పేరుతో మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, గుజరాత్‌లో జరిగిన అల్లర్లు ప్రపంచమంతా తెలుసనీ చెప్పారు.వాటన్నిటిపైనా రాబోయే సీపీఐ జాతీయ మహాసభల్లో చర్చిస్తామన్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు దిల్లీలో జాతీయ కార్యవర్గం, సమితి సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వంలో చేరతామనే ప్రకటన సిగ్గుచేటు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సినీ నటులు నరేశ్‌, పవిత్ర తరహాగా పెళ్లి కాకుండా వైసీపీబీజేపీ సహజీవనం చేస్తోందని, పైపెచ్చు 2024 ఎన్నికల తర్వాత హోదా షరతుతో బీజేపీ ప్రభుత్వంలో చేరతామంటూ వైసీపీ చెప్పడం నిస్సిగ్గుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ వైసీపీ గుడ్డిగా మద్దతిస్తూ, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ, బీజేపీ బంధంపై వైసీపీ ఎంపీ శ్రీధర్‌ చెప్పినందుకు రామకృష్ణ ఆయనను అభినందిం చారు. రాష్ట్రానికి కేంద్రం ఏం నిధులు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకూ వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతివ్వడం విచారకరమన్నారు. రాష్ట్రానికి హోదా, విభజన చట్ట హామీలు ఏ మేరకు అమలు చేశారో తెలపాలన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం పెట్టకపోగా, విశాఖలో ఉన్న దాన్ని ప్రైవేట్‌ పరం చేస్తామంటే వైసీపీ ఎంపీలు నోరు మెదపడంలేదన్నారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నావ ుని చెబుతూ, పాఠశాలలను జగన్‌ మూసివేయిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితికి తెచ్చారని వివరించారు. అటు ఆంగ్ల మాద్యమం అని చెబుతూనే, ఇటు విద్యార్థులకు విద్యను దూరం చేసే పరిస్థితి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసివే స్తున్నారని ఆగహం వ్యక్తంచేశారు. మూడేళ్ల నుంచి ప్రభుత్వ ప్రకటనలు ఒక్క సాక్షికే ఇస్తూ, రూ.280 కోట్లు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏకపక్షంగా తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి అది ప్రభుత్వ సొమ్మా, లేక జగన్‌ సొంత సొమ్మా? రాష్ట్రం మీ జాగీరా? కేవలం సాక్షికే ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారని ప్రశ్నించారు. పైపెచ్చు 2.66లక్షల మంది వలంటీర్లకు సాక్షి దినపత్రిక కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చా రనీ, ఆయా బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్ణయించడం దారుణమన్నారు. ఆర్టీసీ తరహాగా సాక్షి పత్రికని ప్రభుత్వం విలీనం చేసుకోవాలన్నారు. పత్రికలకు ప్రకటనల జారీలో జరుగుతున్న అన్యాయంపై అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి దిల్లీ స్థాయిలో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img