Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సమానత్వం కోసం నిరంతర పోరు

చే పోరాటం అజరామరం
. ఆయన త్యాగం టీ షర్టులు, టోపీల్లో వద్దు
. ప్రజా ఉద్యమాల్లో మమేకం కావాలి
. అదే నా తండ్రికి నిజమైన నివాళి
. చే గువేరా కుమార్తె అలైదా
. క్యూబా సంఫీుభావ సభలో కీలక ప్రసంగం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : తన తండ్రి చే గువేరా పోరాట పటిమ అజరామరం అని, విశ్వవ్యాప్తంగా చే గువేరా అభిమానులు విప్లవ పోరాటం ద్వారా స్ఫూర్తి పొందాలని చేగువేరా కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా పిలుపునిచ్చారు. తన తండ్రి వారసత్వాన్ని టీ షర్టుల్లోను, టోపీల్లోను చూడటం భావ్యం కాదనీ, ఆయన త్యాగం, ఆ ధైర్యం, ఆ తెగువ పుణికిపుచ్చుకుని ప్రజాఉద్యమాల్లో మమేకమవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సోమవారం క్యూబా సంఫీుభావ సభ నిర్వహించారు. తొలుత క్యూబా సంఫీుభావ ఆహ్వాన సంఘం కన్వీనర్‌ బుడ్డిగ జమిందార్‌ సభకు స్వాగతం పలుకుతూ, క్యూబాపై అగ్రరాజ్యమైన అమెరికా పెత్తందారి పోకడల్ని వివరించారు. ముక్తకంఠతో క్యూబాకు సంఫీుభావం తెలపాలన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా డాక్టర్‌ అలైదా గువేరా(చే గువేరా కుమార్తె), ప్రొఫెసర్‌ ఎస్తేఫానియా గువేరా (చే గువేరా మనుమరాలు), వామపక్ష పార్టీలు, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, అభ్యుదయవాదులు, రచయితలు పెద్దఎత్తున హాజరయ్యారు. సభకు క్యూబా సంఫీుభావ ఆహ్వాన సంఘం కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. అలైదా గువేరా ప్రసంగిస్తూ తన తండ్రి వారసత్వంగా తాను వైద్యవృత్తిని చేపట్టానని, ఆ వృత్తి తనను ప్రజల హృదయాల చెంతకు చేర్చిందని నొక్కిచెప్పారు. సంఫీుభావమనేది ఇవ్వడం ద్వారా గొప్పమనస్సును చాటుకునేదనీ, భారత దేశంలోనే కాక, ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు క్యూబాకు తమవంతు సంఫీుభావం ప్రకటిస్తున్నారని, అది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. సంఫీుభావం మానవతా విలువులతో కూడుకున్నదనీ, మానవతా సందేశమే సంఫీుభావానికి ఊపిరన్నారు. క్యూబా వ్యాప్తంగా తమ దేశ ప్రజలు అత్యంత చైతన్యవంతంగా ఉంటారని, ప్రపంచశాంతికి తమ వంతు నిర్మాణాత్మకమైన కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రజారోగ్యం అనేవీ అత్యంత ప్రాధాన్యత అంశమని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండేలా అన్ని విధాలా చూడాలన్నారు.
సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా క్రియాశీలకపాత్ర పోషించారని, తాను ఎంచుకున్న వైద్యవృత్తి సమాజానికి సేవచేయడంతోపాటు అంకితభావంతో విస్తృతస్థాయి సేవలందించేలా తన దృష్టి కోణాన్ని మార్చిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి భాషలు, సరిహద్దులు అడ్డుగోడలు కారాదనీ, విశ్వవ్యాప్తంగా ప్రేమ, ఆత్మీయతానురాగాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఆమె కోరారు. చేగువేరా వారసులం కావడం తమకు గర్వకారణమే అయినప్పటికీ…ప్రపంచ వ్యాప్తంగా చే గువేరా అభిమానులు కోట్ల సంఖ్యలో ఉండటం తమకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. విప్లవ పోరాటాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం పాటుపడేవారే తన తండ్రికి నిజమైన వారుసులని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా భాషలోని ఒక కవితను ఆమె విన్పించారు. ఒక వ్యక్తి చనిపోతే ఎవ్వరూ ఏడ్వవద్దు అనీ, కానీ ఆ వ్యక్తి చనిపోయినందుకు జీవితానికి ఒక సార్థకత ఉండాలని, అప్పుడే జనం మధ్య వ్యక్తి బ్రతుకుతారంటూ కవిత సారాంశాన్ని వివరించారు. విద్యా, వైద్య రంగాలపై దేశ వ్యాప్తంగా మనం నిరంతరం ఉద్యమించాలని సూచించారు. ‘నేను’ అనే పదం కంటే…‘మేము’ అనే పదాన్ని వినియోగిస్తే బాగుంటుందన్నారు.
ఇతరుల మాటలను మనం ఎప్పుడూ వింటూ ఉండాలని చెప్పారు. సమానత్వంపై మనం నిరంతరమూ పోరాడాలని, సాంస్కృతిక, రంగు, లింగ విభేదాల్ని పారద్రోలాలన్నారు. చే గువేరా ఆశయాలు, ఆదర్శాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా ఐక్యంగా కృషి చేద్దామన్నారు. సభ ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.చంద్రనాయక్‌, చిన్నం పెంచలయ్య, నాయకులు ఆర్‌.పిచ్చయ్య, నాజర్‌ తదితరులు అభ్యుదయ గేయాలను ఆలపించారు. విద్యార్థినులు నృత్యాలు ప్రదర్శించారు. వేదికపైన డాక్టర్‌ అలైదా గువేరా , ప్రొఫెసర్‌ ఎస్తేఫానియా గువేరా (చేగువేరా మనుమరాలు)ను ఆహ్వాన సంఘం సభ్యులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి సత్కరించారు. గన్నవరం విమానాశ్రయంలో అలైదా గువేరా, ఎస్తేఫానియా గువేరాకు ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులతోపాటు వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img