Monday, January 30, 2023
Monday, January 30, 2023

సహించేది లేదు.. ఖబడ్దార్‌

వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై ‘నందమూరి’ కుటుంబం ఫైర్‌

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితీనే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదు’ అని బాలకృష్ణ అన్నారు. ‘ప్రజల తరపున.. పార్టీ తరపున నా అభిమానుల తరపున ఇదే నా హెచ్చరిక.. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్‌.. భరతం పడతాం. ప్రతి విషయానికి హద్దు ఉండాలి. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు’ అని బాలకృష్ణ హెచ్చరించారు. ఇదే అంశంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ప్రజా సమస్యలన్ని పక్కపెట్టి, వ్యక్తిగత దూషణలకు అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఓ అరాచక పాలనకు నాది అని అన్నారు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవజీవాల్లో మన ర్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు బంగారుబాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు అని అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ‘‘ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం’’ అని నారారోహిత్‌ పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని కించపరిచేలా కొందరి వ్యాఖ్యానించడం బాధాకరమైన విషయమని, ఆయన కంటితడి తీవ్ర మనస్తాపం కలిగించిందని సినీ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ఏ మాత్రం స్థాయిలేని వ్యక్తులు చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేయడం బాధకరమైన విషయమని అశ్వనీదత్‌ అనగా, ఇలాంటి ఘటనలతో సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలుగుతుందని బండ్ల గణేశ్‌ పేర్కొన్నారు. ఇక వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాలని, మహిళలంతా ఏకమై ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వహననం సహేతుకం కాదన్నారు. తను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామని, విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని పురంధేశ్వరి పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని మండిపడ్డారు. అయితే చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరైన సంప్రదాయం కాదని, వచ్చే ఎన్నికల్ల బాబు గెలిస్తే.. నీ పరిస్థితి ఏంటి జగన్‌? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేని పాలన ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషించడం అసహ్యకరమైన పని. ఇప్పుడు చంద్రబాబునాయుడి సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. అలాంటప్పుడు వ్యక్తిగతం దూషణలు చేయొద్దు. ఈ చెత్త సంప్రదాయం రావటం మన కర్మ. ముఖ్యంగా మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు. తొలిసారి అందరి ముందూ బాబు కన్నీటి పర్యంతమవటం నాకు చాలా బాధనిపించింది. ఇకకైనా ఈ సంప్రదాయానికి ముగింపు పలకండి అని నాగబాబు పేర్కొన్నారు. ఇక వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై నందమూరి కుటుంబ సభ్యులు రామకృష్ణ, చైతన్య కృష్ణ, లోకేశ్వరి తదితరులు స్పందించారు. రాయకీయాలకు, వ్యక్తిగత విషయాలకు ముడిపెట్టవద్దని… ఈ దుష్ట సంప్రదాయాన్ని వదలకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img