Monday, August 8, 2022
Monday, August 8, 2022

‘సాకులు చెప్పకండి… సమస్యను పరిష్కరించండి’

విద్యుత్‌ సంక్షోభంపై యూపీ ప్రభుత్వానికి అఖిలేశ్‌
లక్నో : విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులుగా, రాష్ట్ర ప్రభుత్వం ‘సాకులు చెబుతోంది’ అని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం విమర్శించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు మూసివేయడం గురించి మాట్లాడిన ఇంధన శాఖ మంత్రి ఎ.కె.శర్మ ఇచ్చిన సమాచారం సారాంశాన్ని జత చేస్తూ అఖిలేశ్‌ ఒక ట్వీట్‌ను పోస్ట్‌ చేశాడు. ఈ వార్తను పంచుకుంటూ, ‘ప్రభుత్వ పని సమస్యకు కారణాన్ని చెప్పడం కాదు. దానిని పరిష్కరించడం’ అని అన్నారు. ఇదిలాఉండగా, అంతకుముందు రోజు శర్మ ఒక ట్వీట్‌ చేస్తూ, ‘యూపీలోని కొన్ని విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు సాంకేతిక కారణాల వల్ల చాలా వారాలపాటు మూతపడ్డాయని, ఇందులో హర్దుగాంజ్‌-660 మెగావాట్లు, మెజా-660 మెగావాట్లు, బారా-660 మెగావాట్లు ఉన్నాయి. సీజనల్‌ తుఫాను కారణంగా హర్దుగాంజ్‌-605 మెగావాట్లు కూడా దెబ్బతిన్నాయి. వాటిని సరిచేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా శుక్రవారం అఖిలేశ్‌… అధికార భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు వేడి, అప్రకటిత విద్యుత్‌ కోతలతో కాలిపోతున్నారని ఆరోపించారు. పూర్వాంచల్‌ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెరుగుతున్న ఎండ వేడిమితో విద్యుత్‌ సంక్షోభం తీవ్రమైందని అన్నారు. కాగా శర్మ శుక్రవారం మరొక ట్వీట్‌లో ‘వేసవి కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. సాంకేతిక కారణాల వల్ల చాలా పవర్‌ ప్లాంట్లు వారాలపాటు మూసివేతకు గురయ్యాయి. విద్యుత్‌ను ఆదా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయండి. నిరంతరాయంగా సరఫరా చేసేందుకు మా విద్యుత్‌ ఉద్యోగులు పగలు రాత్రి శ్రమిస్తున్నారు’ అని తెలిపారు. ‘ఈ సవాలు సమయాల్లో’ వారంలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని శర్మ విద్యుత్‌ శాఖ సిబ్బందిని కోరారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం విద్యుత్‌ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాను నిర్వహించడానికి అదనపు (యూనిట్ల) విద్యుత్‌ కోసం కూడా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోయినా లేదా విద్యుత్‌ వైర్లు దెబ్బతిన్నా వెంటనే సమస్యను పరిష్కరించాలని యోగి అన్నారు. విద్యుత్‌ శాఖ అధికారి ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 22,000 మెగావాట్లు ఉండగా, లభ్యత దాదాపు 19,000 మెగావాట్లు ఉంది. దీని కారణంగా గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్తు నిలిచిపోతుంది. గతంలో విద్యుత్‌ శాఖ అందుబాటులో ఉంచిన వివరాల ప్రకారం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణీత 18 గంటలకు సగటున 15 గంటల ఏడు నిమిషాల విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అదేవిధంగా పట్టణాల్లో నిర్ణీత 21 గంటల 30 నిమిషాలకుగాను సగటున 19 గంటల మూడు నిమిషాలు, తహసీల్‌ ప్రధాన కార్యాలయంలో 21 గంటల 30 నిమిషాలకు 19 గంటల 50 నిమిషాలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అయితే జిల్లా కేంద్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 5,820 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, మిగిలిన విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img