. కష్టాల్లో కౌలు రైతులు
. గత ప్రభుత్వ విధానాలతో నష్టం
. ఖరీఫ్ గుర్తింపు కార్డుల జారీలో జాప్యం
. అందని రబీ ధాన్యం సొమ్ము
. ఏలూరు, బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పెండిరగ్
ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ కౌలు రైతుల కష్టాలు తీరలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నింటా నష్టపోయిన కౌలు రైతులు… ఈ కూటమి ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారు.
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ కౌలు రైతుల కష్టాలు తీరలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నింటా నష్టపోయిన కౌలు రైతులు… ఈ కూటమి ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల నుంచి రబీ కాలంలో విక్రయించిన ధాన్యం బకాయిలు, గుర్తింపు కార్డుల్లో భూ యజమానుల నుంచి అడ్డంకులు, ప్రతి ఏటా రైతు భరోసా, పంటల బీమా అందరికీ అందకపోవడం తదితర సమస్యలు పీడిస్తున్నాయి. ఖరీఫ్ నాటికి వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పంటల సాగు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో భాగంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తామని, పంటల బీమా వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. దీంతో వ్యవసాయ సాగులో కౌలు రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అత్యధికంగా కౌలు రైతులే భూములు సాగు చేస్తున్నారు. ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో గత రబీలో రైతులు విక్రయించిన ధాన్యం బకాయిలపై సభ్యులు లేవనెత్తారు. ఇంకా రబీ బకాయిలే ఇవ్వకుంటే… ఖరీఫ్‌కు రైతాంగం ఎలా ముందుకు వెళుతుందని వారు ప్రశ్నించారు. రబీలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,700 కోట్ల ధాన్యం బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఏలూరు జిల్లా రూ.250 కోట్లు, కోనసీమ రూ.250 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.850 కోట్లు, అలాగే కాకినాడ, బాపట్ల తదితర జిల్లాలకు రావాల్సి ఉంది. దాదాపు కొంతమేర విడుదలకు తాము యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చినప్పటికీ… ఇంతవరకు దానిపై కదలిక లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన జులై 20వ తేదీ వరకు బ్యాంకులు, ఇతర వనరుల నుంచి ప్రభుత్వ హామీపై పౌర సరఫరాల శాఖ ద్వారా రూ.37,550 కోట్లు రుణాలు తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడిరచారు. ఇందులో 14 జాతీయ బ్యాంకుల నుంచి రూ.32,300 కోట్లు ఉండగా, ఏపీ మార్క్‌ఫెడ్ నుంచి ఇంటర్ కార్పొరేట్ రుణం (ఎన్‌సీడీసీ ద్వారా) రూ.5 వేల కోట్లు, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్ నుంచి హామీ లేని రుణం రూ.250 కోట్లు ఉన్నాయి. వాటిని వరి సేకరణతో పాటు ఎంఎస్‌సి కార్యకలాపాలు, పీడీఎస్ కార్యకలాపాల కింద బియ్యం, ఇతర వస్తువుల పంపిణీకి వినియోగిస్తున్నారు.
ఓసీలకు రైతు భరోసా ఏదీ?
కౌలు రైతుల్లో ఓసీలకు రైతు భరోసా అందలేదన్న అంశాన్ని శాసన మండలిలో సభ్యులు ప్రశ్నించారు. దీంతో మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు జోక్యం చేసుకుని అలాంటిదేమీ ఉండదని, అధికారులంతా సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. దానిపై టీడీపీ సభ్యులు లేచి… కౌలు రైతులకు ఇచ్చే కొద్దిపాటి సాయాన్ని సైతం కులాలతో ముడిపెట్టడం తగదని, తక్షణమే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల కావాల్సిన కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీపై ఇంతవరకు కదలిక లేదు. రబీలో వర్షాభావం వల్ల దెబ్బతిన్న పంటలకూ నష్టపరిహారం ఇవ్వలేదు. పైపెచ్చూ నష్టపోయిన పంటల అంచనా కోసం కేంద్ర బృందాలు ఆలస్యంగా రావడంతోనూ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. పంట రుణాలూ వారికి సక్రమంగా అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఇచ్చే రైతు భరోసాకు రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ, దానినీ సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలున్నాయి.
గత ప్రభుత్వ విధానాలు… కౌలు రైతులకు శాపం
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటల సాగు చట్టం కౌలు రైతులకు శాపంగా మారింది. ఈ చట్టం ఆధారంగా కౌలు రైతులు తమ గుర్తింపు కార్డులు పొందాలంటే… ఆయా భూ యజమానుల అనుమతులను పొందాలన్న నిబంధన విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ భూములను కౌలుకు ఇచ్చినట్లుగా భూ యజమానులు సంతకాలు చేయడం అనివార్యం. అలా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో ఈ చట్టం ఆశయం పక్కదారి పట్టి అసలైన కౌలు రైతులకు నష్టం చేకూరింది. ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని సాగు చేస్తున్న కొందరు భూ యజమానులే… తమ పొలాలను కొందరికి కౌలుకు ఇచ్చినట్లుగా సృష్టించి, నకిలీ కౌలు రైతుల గుర్తింపు కార్డులు పొందారు. తద్వారా ప్రభుత్వం ఇచ్చే సాయం భూ యజమానులకే చేరడంతో వారసత్వ కౌలు రైతులకు అన్యాయం జరిగింది. దీనిని కూటమి ప్రభుత్వం గుర్తించి భూ యజమానుల ప్రమేయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండిరగ్‌లో ఉన్న రబీ ధాన్యం బకాయిల విడుదలకు, కౌలు రైతులు అందరికీ వేగవంతంగా గుర్తింపు కార్డులు జారీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.