Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

సామాజిక న్యాయం లేదు

పేద ప్రజలకు రక్షణ కరవు
అధికారం లేని డమ్మీ మంత్రులు
జగన్‌ ఏకపక్ష వైఖరి వల్లే అంబేద్కర్‌ పేరు వివాదం
వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 2న చలో రాజ్‌ భవన్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర`అనంతపురం అర్బన్‌: కోనసీమ జిల్లా వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్‌ నీలం రాజశేఖర్‌ రెడ్డి భవన్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యుడు కేశవ రెడ్డితో కలసి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఏకపక్ష ధోరణి వల్ల రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి రావణ కష్టానికి దారితీశాయని విమర్శించారు. జిల్లాల విభజన, పేర్లు మార్పు వంటి కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వమే అమలు చేయాల్సి ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు జిల్లాల పెంపును స్వాగతించాయన్నారు. అయితే సీఎం జగన్‌ రాష్ట్రం తన జాగీరైనట్టుగా కనీసం మంత్రివర్గ సమావేశం లేకుండా ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకొని ఏకపక్ష ధోరణితో పోవడమే గొడవలకు కారణమని విమర్శించారు. కడప జిల్లా ప్రజలు జగన్‌కు ఓట్లు వేసినందుకు వైఎస్సార్‌ కడప జిల్లా పేరులో నుంచి కడపను తీసివేశారని అసహనం వ్యక్తం చేశారు. కడప పేరును ఎవరినడిగి తీశారో చెప్పాలన్నారు. కోనసీమ జిల్లా విషయంలో అంబేద్కర్‌ పేరును ముందే పెట్టకుండా, అందరితో చర్చించకుండా ఆ మహనీయుని పేరును కూడా సీఎం జగన్‌ వివాదాస్పదం చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరుకు కళంకం తెచ్చిన ఘన చరిత్ర సీఎం జగన్‌కే దక్కుతుందని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌గా ఉన్న దళిత యువకుడిని అతిదారుణంగా కొట్టి హత్య చేసి మృతదేహాన్ని కారులో నేరుగా వారి తల్లిదండ్రుల వద్దకే తీసుకెళ్లగలిగారంటే రాష్ట్రంలో చట్టమనేది ఉందా లేదా అని విచారం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలే చట్టాన్ని గౌరవించకపోతే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చేతిలో చనిపోయిన డ్రైవర్‌ భార్య మూడు నెలల గర్భవతి అని, ఇప్పటి వరకు కనీసం ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ మద్యం తాగి డ్రైవర్‌ని కిరాతకంగా చంపితే, చనిపోయిన డ్రైవర్‌ మద్యం తాగాడని ఎస్పీ చెప్పడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని తూర్పారబట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్నందునే ఇష్టానుసారంగా చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అధికార పార్టీకి బలైన విశాఖపట్నం డాక్టర్‌ సుధాకర్‌ నుంచి ప్రారంభమైన దుర్మార్గపు చర్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు మంత్రి పదవులతోపాటు ఇతర పదవులు ఇచ్చినప్పటికీ రూపాయి ఖర్చుపెట్టే అధికారం సీఎం జగన్‌ ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పులు తీసుకునివస్తే సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పంచడం తప్ప ఎవరికీ ఎలాంటి అధికారం లేదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర మంత్రులందరూ ఆత్మాభిమానం కోల్పోయిన డమ్మీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి మాత్రమే అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగలేదని, మంత్రులెవరో ప్రజలకు తెలియనందునే సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. మంత్రుల బస్సు యాత్ర నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి సామాజిక న్యాయం గురించి దళితుడిని చంపిన వ్యక్తిని అడగాలన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి ఆద్యులు మహాత్మా జ్యోతి బాపూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని, అలాంటిది ఓ జిల్లాకు అంబేద్కర్‌ పేరుపెట్టడంపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదని, రేపల్లె రైల్వే స్టేషన్‌లో పేద గర్భిణిపై అత్యాచారం జరిగితే హోం మంత్రి స్పందించిన తీరు బాధాకరమన్నారు. దావోస్‌లో సీఎం జగన్‌ వద్దకు అందరూ వస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం హాస్యాస్పదమని, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వద్దకు చేరుకొని హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. యూనిట్‌ 1 రూపాయి 99 పైసల విద్యుత్‌ను 2 రూపాయల 49 పైసలకు కమీషన్ల కోసం సీఎం జగన్‌ కొంటున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎండ లేనట్లు రాజస్థాన్‌ నుంచి సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు చేసి అదానీ కమీషన్లకు లాలూచీ పడ్డారని విమర్శించారు. జగన్‌ సీఎం అయిన తర్వాత విశాఖపట్నం కబ్జాలకు గురై బ్రాండ్‌ ఇమేజ్‌ పోగొట్టుకుందని అన్నారు. అప్పట్లో అమరావతిలో 40 వేల మంది పని చేసేవారని, ప్రస్తుతం వాచ్‌మెన్‌ తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందకూడదని జగన్‌ కంకణం కట్టుకున్నారని అన్నారు. కడపలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారని, అయితే సీఎం జగన్‌ ఏకంగా శిలా ఫలకం వేసి ఇంతవరకు స్టీల్‌ ఫ్యాక్టరీని స్థాపించలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చాలా బాధాకరమైన పరిస్థితులున్నాయని, జగన్‌ను చూసి పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు కారణమైన వైసీపీ పాలనకు వ్యతిరేకంగా జూన్‌ 2న చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం నిర్వహించి గవర్నర్‌కి అన్ని విషయాలు వివరిస్తామని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో దళితులు, బడుగు వర్గాలు, పేద ప్రజలందరికీ సీపీఐ అండగా ఉంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img