Friday, October 7, 2022
Friday, October 7, 2022

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటన..ఎనిమిదికి చేరిన మృతులు

చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఓ మహిళ మృతి
పోలీసుల అదుపులో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వ్యాపారి

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రూబీ ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూంలో సోమవారం రాత్రి చెలరేగిన మంటల కారణంగా.. పై అంతస్థుల్లో ఉన్న లాడ్జిలోకి దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో మరణించారు. తాజాగా ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ మరొక మహిళ మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో 25 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులు గాంధీ, యశోద, అపోలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఎలక్ట్రిక్‌ బైక్‌కు ఛార్జింగ్‌ పెట్టిన సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో షోరూంలోని బైక్‌లు దగ్ధం కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పై అంతస్థుల్లో ఉన్న హోటల్‌ రూమ్‌లోకి దట్టమైన పొగలు అలముకున్నట్లు అగ్నిమాపక అధికారి మీడియాతో వివరించారు. లాడ్జి లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉండటంతోనే మరణాలు సంభవించాయని చెప్పారు. లాడ్జిలో ఉన్నవారంతా మెట్ల మార్గం నుంచి కిందకు రాలేకపోయారని.. హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో భవనంలో ఉన్న 9 మందిని కాపాడినట్లు ఆయన తెలిపారు.
భారీ అగ్ని ప్రమాదంపై ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ షోరూమ్‌ నిర్వాహకుడు రంజిత్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సెక్షన్‌ 304ఏ కింద కేసు నమోదు చేశారు. రూబీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో పాటు లాడ్జిని కూడా అధికారులు సీజ్‌ చేశారు. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు వ్యక్తులు తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో నాలుగో అంతస్థు నుంచి పైపులు పట్టుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img