సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి
విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట కాయదశకు వచ్చే తరుణంలో వర్షాభావం కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన కౌలు రైతు కాట్నేకాలువ నారాయణ పొలంలోని వేరుశనగ పంటను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యాదర్శులు చిరుతల మల్లికార్జున, కాటమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వేమయ్యయాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తదితరులతో కలిసి రామకృష్ణ పరిశీలించారు. అనంతపురం జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ 7 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుండగా ఈ ఏడు 4.50లక్షల హెక్టార్లకే పరిమిత మైందని, నిర్దిష్ట సమయంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయని, ఒక్కో మొక్కకు కనీసం ఐదారు కాయలు కూడా కాయలేదంటే బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు దాదాపు రూ.30వేలు పెట్టుబడి పెడితే కనీసం వేరుశనగ కట్టె కూడా చేతికందే స్థితి లేదని, రైతులు బ్యాంకు రుణాలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారన్నారు. వ్యవసాయశాఖ మంత్రి, వ్యవసాయాధికారులను అనంత పురం, కర్నూలు జిల్లాలకు పంపి క్షేత్రస్థాయిలో పంట నష్ట పరిహారం పై అంచనాలు వేయించి, రైతులను తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఈ ఏడాది ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమాను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రాప్తాడు, అనంతపురం రూరల్ మండల కార్యద ర్శులు సాకే నాగరాజు, రమేష్, ఏఐవైఎఫ్ నేత రమణయ్య, గిరిజన సమాఖ్య నేత రామాంజనేయులు, హంపాపురం ఎంపీటీసీ మోదుపల్లి రవికుమార్, మాజీ సర్పంచ్ గోపాల్, నంబూరి నాగరాజు, ప్రతాప్, నంబూరి మధు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ బాబు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజేష్, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ నాయకులు శ్రీకాంత్, పాళ్యం ప్రసాద్, రవీంద్ర, వెంకటనారాయణ, శ్రీరాములు, నల్లప్ప, ప్రసాద్, చలపతి, మౌలాలి, రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నరసింహ, కుల్లాయిస్వామి, మహేష్, వంశీ, మదన్ పాల్గొన్నారు.
పవన్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలపై దృష్టి సారించకుండా ఆన్‌లైన్లో సినిమా టికెట్ల ధరలు పెడుతున్నారన్న అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడడం బాధాకరమని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. హంపాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్లపై పవన్ స్పందిస్తే ఒకేసారి నలుగురు మంత్రులు ఆయన పైన విరుచుకుపడ్డారన్నారు. ఒకపక్క రైతు పోరాటం, మరోపక్క విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం, ఇంకో వైపు అమరావతి రాజధాని కోసం 700 రోజులుగా రైతుల ఉద్యమం జరుగుతున్నా… ఇలాంటి పోరాటాలను పట్టించుకోని పవన్, సినిమా టిక్కెట్ల పైన మాట్లాడా డన్నారు. దీనిపై ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఏ ఒక్కరికీ ఒరిగిందేమీ లేదన్నారు. భారత్ బంద్‌లో కూడా పాలు పంచుకోకవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.