Friday, March 24, 2023
Friday, March 24, 2023

సీఎం దిల్లీ పర్యటనపై దద్దరిల్లిన ఉభయసభలు

. వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్‌
. చర్చకు టీడీపీ పట్టు
. పోడియం చుట్టుముట్టిన సభ్యులు
. 11 మందిపై సస్పెన్షన్‌ వేటు
. మండలిలో ప్రతిపక్ష సభ్యుల వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. వరుసగా నాల్గవ రోజు కూడా ప్రతిపక్ష సభ్యులంతా సస్పెన్షన్‌కు గురయ్యారు. అత్యంత కీలకమైన బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్లడం, రాష్ట్ర విభజనకు సంబంధించిన పాత అంశాలే ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చినట్లు ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. సీఎం దిల్లీ పర్యటనపై చర్చ కోరుతూ అసెంబ్లీ, శాసనమండలిలో టీడీపీ సభ్యులు శనివారం వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని రెండు సభల్లోనూ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి…సీఎం దిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసమా? సొంత ప్రయోజనాల కోసమా? చెప్పాలని నినాదాలు చేస్తూ చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘విశాఖ రైల్వే జోన్‌ వచ్చిందా…?, పోలవరం నిధులు వచ్చాయా…? ప్రత్యేక హోదా వచ్చిందా ?, దిల్లీకి పోయావు, ఏమి తెచ్చావు?, గోవిందా…గోవిందా…’ అంటూ రాసిన ప్లకార్డులతో ఉభయసభల్లోనూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆకస్మికంగా దిల్లీ వెళ్లాల్సిన పరిస్థితులపై సీఎం స్వయంగా కాని, రాతపూర్వకంగా కానీ సభ ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్‌ను చుట్టుముట్టి బిగ్గరగా నినాదాలు చేశారు. వీరి ఆందోళనను పట్టించుకోకుండా స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దీంతో కాగితాలు చింపి స్పీకర్‌పై విసిరేశారు. స్పీకర్‌ ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్షానిది బాధ్యతా రాహిత్యమని మండిపడ్డారు. సభా నాయకుడు తనకు గొప్ప బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నట్లు చెప్పారు. చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జోక్యం చేసుకొని…సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలపై చర్చించారని తెలిపారు. విభజన వల్ల పెండిరగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులపై మోదీతో సీఎం చర్చించారని పేర్కొన్నారు. ఈ విషయం అన్ని పేపర్లలో వచ్చిందని, ఈ విషయం తెలిసి కూడా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని, దేశ చరిత్రలో సీఎం పర్యటనపై వాయిదా తీర్మానం కోరిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మాట్లాడటానికి ఏమీ లేకనే వితండవాదాలు, వింత వాయిదా తీర్మానాలు ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపైనా, టీడీపీ పెట్టిన బకాయిలపైనా చర్చిద్దామా? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబు 30 సార్లు దిల్లీకి వెళ్లారని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు గత దిల్లీ పర్యటనలపై చర్చిద్దామా? అని అడిగారు. సహజంగా అసెంబ్లీలో జరగరాని సంఘటనలు,అనుకోని విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే వాయిదా తీర్మానాలిస్తారని, కానీ టీడీపీ సభ్యులు టిఫిన్‌ ఏం తిన్నారో చెప్పమని కూడా వాయిదా తీర్మానం ఇచ్చేలా ఉన్నారని హేళన చేశారు. సభను పక్కదారి పట్టించేందుకు, సస్పెండ్‌ కావడం కోసమే వారు ఆందోళన చేస్తున్నారని, అందువల్ల వారిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘అప్పుల అప్పారావు బుగ్గన..మాకు ఆవు కథలు చెప్పొద్దు…జగన్‌ 18 సార్లు దిల్లీ వెళ్లి ఎప్పుడూ చెప్పిన అబద్దాలే ఇప్పుడూ చెప్పారు. బడ్జెట్‌ సమయంలో అర్ధాంతరంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకే మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. దీనిపై చర్చ పెట్టాల్సిందే’నని డిమాండ్‌ చేశారు. ఒకపక్క ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, మరోపక్క అధికారపార్టీ సభ్యుల కామెంట్లతో సభలో గందరగోళం ఏర్పడిరది. ప్రశ్నోత్తరాలకు అవాంతరం ఏర్పడటంతో మంత్రి బుగ్గన ప్రతిపాదన మేరకు స్పీకర్‌ వరుసగా నాల్గవ రోజు టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్‌ చేశారు.
కింజరాపు అచ్చెన్నాయుడు, గద్దె రామమోహన్‌రావు, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, బెందాళం అశోక్‌, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయస్వామిలను ఒక్కరోజుకి సస్పెండ్‌ చేశారు. దీంతో వీరంతా సీఎం దిల్లీ పర్యటనలో లోగుట్టు చెప్పరా ? అని నినాదాలు చేస్తూ శాసనసభ వెలుపలా కొద్దిసేపు నిరసన తెలియజేశారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడారు. అటు శాసనమండలిలోనూ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఆ సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి తదితర మంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరికినందున రాష్ట్ర సమస్యలపై నివేదించేందుకు సీఎం దిల్లీ వెళ్లారన్నారు. శాసనసభ సమావేశాలు ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతాయని, ఈలోగా సభ్యులు కోరిన మేరకు సీఎం దిల్లీ పర్యటనపై ఒక ప్రకటన వెలువడుతుందని సభకు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వినకుండా తమ తమ స్థానాల నుంచి లేచి చైర్మన్‌ పోడియం ఎదుట నిలబడి నినదించారు. చర్చకు అవకాశం లేదని చైర్మన్‌ స్పష్టం చేయడంతో ప్రతిపక్ష సభ్యులు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img