Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సీమలో మెగా విద్యుత్‌ ప్రాజెక్టు

కర్నూలు జిల్లాలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌
ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు
రూ.15 వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన గ్రీన్‌కో ఎనర్జీస్‌
ఒకే యూనిట్‌ నుంచి 5,230 మెగావాట్ల సౌర, పవన, జల విద్యుత్‌ ఉత్పత్తి

విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు: ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రూ.15 వేల కోట్ల వ్యయంతో గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. మంగళవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండాలో సీఎం జగన్‌ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గుమ్మటం తాండాకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి హైడల్‌ పవర్‌ ప్లాంట్‌కు కర్నూలు వేదికవడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4766 .28 ఎకరాల భూమిని కేటాయించిందని, ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఒకే యూనిట్‌లో నుంచి సౌర, పవన, జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత అని, ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా విద్యుత్‌ ఉత్పత్తి 3 వేల మెగావాట్లు, హైడల్‌ ద్వారా 1,860 మెగా వాట్లు, విండ్‌ ద్వారా 550 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 23 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అందించే అవకాశం వస్తుందని తెలిపారు. అనంతరం గ్రీన్‌ గ్రూప్స్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ చలమలశెట్టి మాట్లాడు తూ పారిశ్రామిక డీకార్పనైజేషన్‌, ఎనర్జీ ట్రాన్సిషన్‌ కోసం 24 గంటలు అందుబాటులో ఉండే పునరుత్పాదక విద్యుత్‌ పరిష్కారాలను అందించాలనే అంతర్జాతీయ లక్ష్యానికంటే ముందుగానే ఆ దిశగా అడుగులు వేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం గ్రీన్‌కో వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్‌ కొల్లి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూ రు జయరాం, శాసనసభ్యులు ఎర్రకోట కేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్‌్‌రెడ్డి, ఆర్థర్‌, జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో తొలి హైడల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు
ఇంటిగ్రేటేడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా కర్నూలులో తొలి హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. 1,680 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే హైడల్‌ పవర్‌ను పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ అని కూడా అంటారు. హైడల్‌ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే, కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులను నిర్మాణం చేస్తారు. విద్యుత్‌ వాడకానికి డిమాండ్‌ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్‌ చేస్తారు. విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ లేదా హైడల్‌ పవర్‌ అంటారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ అధ్వర్యంలో 33,240 మెగావాట్ల ప్రాజెక్టులు
ప్రైవేటు పాటు ప్రభుత్వ అధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్‌, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారవుతోంది.
15 మిలియన్‌ టన్నుల సీవో2 తగ్గుతుందని అంచనా
పాణ్యం మండలం పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా వాతావరణంలో ఏటా కార్బన్‌ డయాక్సైడ్‌ 15 మిలియన్‌ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్‌, డీజిల్‌ కార్ల బదులుగా ఎలక్ట్రిక్‌ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్‌ డయాక్సైడ్‌ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img