Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

సుప్రీంకు ఆర్‌-5 జోన్‌ వివాదం

. హైకోర్టు తీర్పుపై రైతులు పిటిషన్‌ దాఖలు
. ఇంప్లీడ్‌ కానున్న జడ శ్రవణ్‌కుమార్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌5 జోన్‌ వివాదం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను నిలిపివేయడంతోపాటు భూములిచ్చిన రైతులపై కక్షపూరితంగా వ్యవహరి స్తోంది. దీనిలో భాగంగానే ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రత్యేకంగా సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేసింది. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో జీవో 45 జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రౖెెతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపును సమర్థిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రైతులు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, హైకోర్టులోనే తేల్చుకోవాలని రైతులకు అత్యున్నత న్యాయ స్థానం సూచించింది. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ మేరకు హైకోర్టులో రైతులు పిటిషన్‌ దాఖలు చేసి ఆర్‌5జోన్‌ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేసేలా మధ్యంతర

ఉత్తర్వులు కోరగా, సీజే ధర్మాసనం నిరాకరించింది. గతంలో సుప్రీం ధర్మాసనం కల్పించిన అవకాశం మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసన ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
ఇంప్లీడ్‌ కానున్న జడ శ్రవణ్‌కుమార్‌
ఆర్‌-5 జోన్‌పై సుప్రీంకోర్టులో రైతులు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో జై భీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ ఇంప్లీడ్‌ కానున్నారు. సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా తానే వాదనలు వినిపించనున్నట్లు శ్రవణ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి భూ బదలాయింపు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి యాజమాన్య హక్కులు పొందదని అభిప్రాయపడ్డారు. రైతులు వేసిన పిటిషన్‌ హైకోర్టు కొట్టేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.
దీనిపై సుప్రీంకోర్టులో పోరాడటానికి తమ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్‌-5జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడటం రాజ్యాంగ విధి అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసం తమ పార్టీ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుందన్నారు. భూములిచ్చిన రైతులను దగాకోరులు, కబ్జాకోరులంటూ అవమానించటం ముఖ్యమంత్రికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు తగదని హితవు పలికారు. ఈ న్యాయ పోరాటంలో అమరావతి రైతులు కచ్చితంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img