పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు తిరస్కరించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్ష కారణంగా రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.అయితే ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో రాహుల్ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల శిక్షను రద్దు చేయాలని కోరారు. కానీ సూరత్ సెషన్స్ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. రేపు గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు.2019 ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఇంటిపేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు సంబంధించిన తీర్పును ఇటీవల వెల్లడించారు. దాంట్లో రాహుల్‌కు రెండేళ్ల శిక్ష పడింది.అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఆర్‌పీ మొగేరా గత గురువారం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ ఆయన తీర్పును వెలువరించారు. ట్రయల్ కోర్టు తన పట్ల తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ వాదించారు. తన ఎంపీ స్టేటస్‌ను పట్టించుకోకుండా ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు. అయితే సెషన్స్ కోర్టు ఆ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఇవాళ కోర్టు స్టే ఇచ్చినా లేక గత తీర్పును సస్పెండ్ చేసినా, అప్పుడు రాహుల్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందేవారు.