Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

‘సెంటు స్థలం’పై మళ్లీ ఎదురుదెబ్బ

సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వం హౌస్‌మోషన్‌ దాఖలు
అప్పీలును నిరాకరించిన హైకోర్టు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లిన జగన్‌ సర్కారుకు మరలా భంగపాటు ఎదురైంది. గృహ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. కాని ప్రభుత్వ అప్పీలును స్వీకరించేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన నవరత్నాల్లో ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం అత్యంత కీలకమైనది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదల కోసం టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను సైతం పక్కనబెట్టి పేదలకు పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర భూమి పంపిణీ చేశారు. ఈ భూమి కూడా చాలాచోట్ల ముంపు ప్రాంతాల్లో, ఊరికి దూరంగా, కొండలమీద ఇచ్చారని, నివాసానికి యోగ్యంగా లేవన్న ఆరోపణలున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, లబ్ధిదారుల ఆరోపణలను పట్టించుకోని పాలకపక్షాన్ని కోర్టు సైతం సెంటు భూమి ఎలా సరిపోతుందంటూ ఆక్షేపించడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏపీలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని విస్తృత ప్రచారం చేసుకుంటున్న అధికారపార్టీ నేతలకు కోర్టు తీర్పు దిమ్మెర పోయేలా చేసింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి …ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు’ పథకంలో లోపాలను ఎత్తిచూపుతూ శుక్రవారం సంచలన తీర్పు చెప్పారు. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. సెంటు, సెంటున్నర స్థలాలు సరిపోవని, దీనివల్ల వచ్చే పర్యావరణ, ఆరోగ్య, ఇతర సమస్యలపై ఆయా రంగాల నిపుణులచే ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. నెల రోజుల్లో కమిటీ వేసి, మరో నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఆ నివేదికను పత్రికల్లో ప్రచురించి ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది. ఈ ప్రక్రియ ముగిసేవరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి అర్హులకు డీఫాం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇళ్ల పట్టాలు మహిళలతోపాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు ఇవ్వాలని చెప్పింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుంటున్నట్లు భావిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చునని, ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఏమాత్రం పట్టించుకోలేని హైకోర్టు పేర్కొంది. ఐదేళ్ల తర్వాత లబ్ధిదారుడు ఆ ఇంటిని అమ్ముకునే వీలు కల్పించడం వల్ల, వారికి మరోసారి ఇళ్ల స్థలం ఇచ్చే అవకాశం ఉండదని, ఫలితంగా వారు ఇల్లు లేనివారుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు బాధ కల్గించింది
ఇళ్ల స్థలాల పంపిణీ పథకంపై హైకోర్టు తీర్పు బాధ కల్గించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై పునరాలోచించాలని డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేస్తామని తెలిపారు. సాంకేతిక అంశాల ఆధారంగా కాకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని, స్ఫూర్తిని న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img