ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ ఎద్దేవా
ఉన్నావ్ : కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్‌కు, తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశారు. బీజేపీ పొరపాటున ‘తన సొంత వ్యాపారి’పై ఆదాయపు పన్ను విభాగంతో దాడులు చేయించిందని ఎద్దేవా చేశారు. ఆ వ్యాపారికి చెందిన సీడీఆర్(కాల్ నమోదు వివరాలు) అతనితో సంప్రదింపులు జరిపే అనేక మంది బీజేపీ నాయకుల పేర్లను వెల్లడిస్తుందని అన్నారు. ‘పొరపాటున, బీజేపీ తన సొంత వ్యాపారిపై దాడి జరిపింది. ఎస్పీ నాయకుడు పుష్పరాజ్ జైన్‌కు బదులుగా, పీయూష్ జైన్‌పై దాడి చేసింది’ అని ఇక్కడ ‘సమాజ్‌వాది రథ యాత్ర’ ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ అఖిలేష్ చెప్పారు. సమాజ్‌వాది అత్తర్(సుగంధద్రవ్యము)ను ప్రారంభించింది ఎస్పీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ అని, పీయూష్ జైన్ కాదని కూడా తెలిపారు. ‘అది తన సొంత పార్టీ వ్యాపారిపై దాడులు జరపడం ఒక డిజిటల్ పొరపాటు’ అని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బోర్డు, ఆదాయపు పన్ను విభాగం అనేక దఫాలుగా జరిపిన దాడుల్లో కాన్పూర్‌లోని సుగంధ ద్రవ్యము వ్యాపారి నివాసం, కన్నౌజ్‌లోని ఫ్యాక్టరీ నుంచి దాదాపు రూ.257 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండిని స్వాధీనం చేసుకుంది. కాగా పీయూష్ జైన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కాన్పూర్ కోర్టు సోమవారం ఆదేశించింది. పీయూష్ జైన్ అరెస్టుపై ఎస్పీపై బీజేపీ నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.