Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

స్మార్ట్‌ మీటర్లపై వామపక్షాల భగ్గు

విశాఖలో సీపీఐ, సీపీఎం నిరసన
ప్రజాభిప్రాయ సేకరణ భేటీకి వెళ్లకుండా అడ్డగింత
పోలీసు చర్యలపై జేవీ సత్యనారాయణమూర్తి ఆగ్రహం

విశాలాంధ్ర-విశాఖ : రాష్ట్రంలో కోటి 89 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు అమర్చాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. విశాఖలో గురువారం ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో ఏపీ ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణను సీపీఐ, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. అదానీ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశాయి. ప్రజలపై భారాలు వేస్తే మరో విద్యుత్‌ ఉద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు అనుమతి ఉన్నా వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీల భారాలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతుంటే, స్మార్ట్‌ మీటర్ల పేరుతో మరోసారి భారాలు మోపేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని జేవీ సత్యనారాయణమూర్తి విమర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పడానికి ముందుగానే అనుమతి తీసుకున్నామని, అయినా తమను ఎందుకు అడ్డగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బూటకపు ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే నిలుపు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు తయారు చేసిన నివేదికలు తప్పుల తడక అని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్లపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ అందించడం లేదని గుర్తుచేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలపై 13 వేల కోట్ల రూపాయల భారం వేయాలని ప్రతిపాదించడం సరైంది కాదన్నారు. ఇప్పటికే ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.5 వేల కోట్ల భారం పడిరదని విమర్శించారు. పేద, సామాన్య, మధ్య తరగతిపై భారాలను ఈఆర్‌సీ తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. గతంలో హిందూజాకు 1200 కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని ఈఆర్‌సీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. గ్రీన్‌ ఎనర్జీ పేరుతో 75వేల ఎకరాల భూమిని హైడ్రోజల్‌ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టడాన్ని తిరస్కరించాలని కోరారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఎ.విమల, కె.సత్యనారాయణ, ఎస్‌కే రెహమాన్‌, జి.రాంబాబు, పి.చంద్రశేఖర్‌, సీఎన్‌ క్షేత్రపాల్‌, నాయకులు ఎండీ బేగం, ఎస్‌.మురళి, జి.జయ, కె.వనజాక్షి, పి.పద్మ, అన్నపూర్ణ, ఎం.మన్మథరావు, యు.నాగరాజు, ఎన్‌.నాగభూషణం, పి.గోవిందు, సీపీఎం నాయకులు వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, పి.వెంకటరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img