Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత దేశద్రోహ చట్టం అవసరమా?

బ్రిటిష్‌ నాటి వలస చట్టాలు రద్దు చేయరేం?
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు
124ఎ దుర్వినియోగంపై నోటీసులు

దేశద్రోహం చట్టం విషయంలో కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ చట్టం దుర్వినియోగం కావడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను రద్దు చేయరెందుకు? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు దాటినా స్వాతంత్య్ర సమరమప్పుడు మహాత్మాగాంధీ వంటివారి గొంతు నొక్కేందుకు బ్రిటిష్‌వారు వినియోగించిన చట్టం అవసరమేమిటి? అని నిలదీసింది. ఇది బ్రిటన్‌ నుంచి తెచ్చుకున్న వలస చట్టమని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐపీసీలోని 124ఎ (దేశద్రోహం) సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ మాజీ సైన్యాధికారి, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేశద్రోహం చట్టం దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ‘రాజద్రోహం చట్టంలోని సెక్షన్‌ 124 ఎను ఇష్టమొ చ్చినట్లు వాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను ఇబ్బంది పెడుతు న్నారు. ఈ చట్టం దుర్వినియోగం, రద్దు దిశగా ఆలోచన ఎందుకు చేయలేదు? కేంద్రం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. సెక్షన్‌ 124 ఎ కింద కేసులన్నీ ఒకేసారి విచారిస్తాం’ అని సీజేఐ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బొప్పన్న, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మిస్టర్‌ అటార్నీ జనరల్‌ మేము కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాం. ఇది వలసవాద చట్టం. మహాత్మాగాంధీ, గోఖలే తదితర స్వాతంత్య్ర సమరయోధుల గళాలను అణచివేసేందుకు బ్రిటిష్‌ వాళ్లు వాడిన చట్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్ల తర్వాత కూడా దీని అవసరం ఉందా? దేశద్రోహం నిబంధన పెద్దఎత్తున

దుర్విని యోగం అవుతోంది. చాలా కాలం కిందటే సర్వోన్నత న్యాయస్థానం పక్కకు పెట్టిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఎ దుర్వినియోగం ఆందోళన కలిగిస్తోంది. కట్టెలు కొట్టమంటే మొత్తం అడవినే నరికేసిన చందంగా ఈ పరిస్థితి ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. 75ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం విషయంలో కేంద్రం ఎందుకని నిర్ణయం తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఏ రాష్ట్రాన్నిగానీ ప్రభుత్వాగాన్నీ తప్పుపట్టడం లేదన్న ధర్మాసనం ఈ చట్టాలను ఏజెన్సీలు దుర్వినియోగిస్తుండటం దురదృష్టక రమని, జవాబుదారీనే లేకుండా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించింది. చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టడమే తమ ఉద్దేశంగా పేర్కొంది. తమకు గిట్టని వారిపై ఈ చట్టాన్ని ఆపాదించే పరిస్థితి దేశంలో ఉందని పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా గ్రామీణ పోలీసు అధికారి ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే ఈ చట్టం నిబంధనల కింద అతనిని సులువుగా ఇరికించవచ్చు అని కోర్టు పేర్కొంది. రాజద్రోహం కేసుల్లో శిక్షలు పడటం అరుదని, ఇందులో అనేక అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇదే అంశంపై మరొక పిటిషన్‌ను జస్టిస్‌ యూయూ లలిత్‌ ధర్మాసనం విచారిస్తోందని, దీని తదుపరి విచారణ ఈనెల 27న జరగనుందని తెలిసి..సంబంధిత అన్ని అంశాల విచారణ తేదీని నోటిఫై చేస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. విచారణ సమయంలో దేశద్రోహం చట్టం వినియోగాన్ని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సమర్థించారు. దీనిని స్టాట్యూట్‌ బుక్‌ (చట్టాలు రాసివుండే పుస్తకం)లో కొనసాగించాలన్నారు.
దుర్వినియోగాన్ని నిరోధించేలా మార్గదర్శకాలను సూచించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. ఐపీసీలోని 124ఎ సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేయడంతో పాటు ఈ చట్టం దుర్వినియోగాన్ని నిరోధించేలా మార్గదర్శకాల రూపకల్పనకు జర్నలిస్టు సంఘం విన్నవించినట్లు న్యాయస్థానానికి తెలిపారు. గతంలో మణిపూర్‌, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు జరల్నిస్టులు సైతం రాజద్రోహం చట్టాన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img