. విమర్శలు, ఆరోపణలతో ఉపయోగం లేదు
. బుడమేరు, కొల్లేరు ఆక్రమణలు తొలగించాలి
. ప్రభుత్వానికి అధ్యయన నివేదిక ఇస్తాం
. శాశ్వత పరిష్కారానికి ఒత్తిడి తెస్తాం
. ‘బుడమేరు టు కొల్లేరు’ పర్యటనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. కేంద్రం తక్షణం నిధులిచ్చి బాధితులను ఆదుకోవాలని డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారంతో పాటు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ముంపునకు గురైన ప్రజలను, రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నేతల బృందం బుడమేరు టు కొల్లేరు పర్యటన కార్యక్రమం చేపట్టింది. బుడమేరు వరద ప్రవాహానికి గండ్లు పడిన ప్రదేశాలను సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గసభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లా సీపీఐ కార్యదర్శులు దోనెపూడి శంకర్, తాతయ్య, ఏలూరు జిల్లా సీపీఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షులు మల్నీడు యలమందరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, ప్రధానకార్యదర్శి శివారెడ్డి, ఎన్‌టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య నేత దుర్గ, బండి వెంకటేశ్వరరావు, కొల్లి రంగారెడ్డి తదితరులు ఉన్నారు. ముందుగా బుడమేరు సప్లై ఛానల్ పై గండ్లు పడిన ప్రదేశాలను నేతలు పరిశీలించారు. కొండపల్లి మండలం శాంతినగర్ సమీపంలో కాలువ పటిష్టత పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో నేతలు మాట్లాడారు. గండ్ల పూడ్చివేతకు సంబంధించి వివరాలను మంత్రి రామానాయుడు నేతలకు వివరించారు. అక్కడ బుడమేరు గండ్లు, పూడ్చివేతలకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నేతలు పరిశీలించారు. తదుపరి సీపీఐ నేతలు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లి పరిశీలన చేశారు. అక్కడ వరద వివరాలను, హెడ్ రెగ్యులేటర్ ఆపరేటింగ్ విధానాన్ని నీటి పారుదల శాఖ డీఈ నాయక్ వివరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయన్నారు. విజయవాడతో పాటు ఎన్‌టీఆర్, కృష్ణ్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాలపై తీవ్ర ప్రభావం పడిరదన్నారు. గతంలో అనేక సందర్భాల్లో వరదలు చూశాం కానీ ఈ సారి విజయవాడ నగరాన్ని బుడమేరు తీవ్రస్థాయిలో ముంచేసిందన్నారు. నగరంలో దాదాపు సగం 32 డివిజన్లకు చెందిన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో లక్షలాది మంది కట్టుబట్టలతో బైటపడి నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రూరల్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారన్నారు. నష్టం రూ.6800 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం కనబడుతోం దని తెలిపారు. పది రోజుల పాటు ఇళ్లలో నీరు నిల్చి ఉండటంతో ఇళ్లు కూలిపోతాయని కూడా భయపడిపోతు న్నారన్నారు. ప్రజలు ఈ విపత్తు నుండి ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కానరావడం లేదన్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి వచ్చి వెళ్లి వారం దాటినా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే బాధితులను ఆదుకునేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే ఇరిగేషన్ అధికారులు వారి విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు బాగా పని చేసి ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రజల్లో భావన కల్పించడానికి ప్రయత్నం చేశారని అన్నారు. ప్రత్యేకంగా మంత్రి నిమ్మల రామానాయుడు నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు కాలవపై ఉండి పనులు పర్యవేక్షించారని, అలానే కొందరు అధికారులు పనులు చేసినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యారన్నారు. ఇటీవల కృష్ణా వరద నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి 11 లక్షలకుపైగా సముద్రంలోకి వదిలారని, అయితే ముందస్తుగా వరద అంచనాలతో అధికారులు చర్యలు చేపట్టి ఉంటే అంత పెద్ద మొత్తంలో ఒకే సారి నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
ఆల్మట్టి డ్యామ్ నుండి ప్రకాశం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల్లోనూ నిండుగా నీళ్లు ఉన్నాయని అందరికీ తెలుసునని, కానీ ముందస్తు చర్యలు చేపట్టడంలో ఇంజనీరింగ్ అధికారులు విఫలమయ్యారన్నారు. వాటర్ మేనేజ్‌మెంట్‌పై ముఖ్యమంత్రి, మంత్రులు చెబితే చేయాలనే ధోరణితో అధికారులు ఉన్నారని, తమ విధులు స్వతంత్రంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. దాని పర్యవసానం ఇటీవల స్పష్టంగా బయల్పడిరదన్నారు. బుడమేరు విషయానికి వస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పెద్దఎత్తున ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ఎలాగైతే ఆక్రమణలను తొలగించిందో, అదే తరహాలో ఇక్కడ కూడా వాటి తొలగింపునకు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.
బుడమేరు టు కొల్లేరు పర్యటన పూర్తి అయిన తర్వాత ఇంజనీరింగ్ నిపుణులతోనూ చర్చించి శాశ్వత పరిష్కారంపై అధ్యయన నివేదికను తయారు చేస్తామన్నారు. అనంతరం ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసి, సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకోవల్సిన చర్యలపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఎక్కడెక్కడ కాలువలను ఏ మేరకు వెడల్పు చేయాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్‌లు ఏర్పాటు చేయాలి, బఫర్ జోన్ ను ఏ రకంగా చేయాలి, ఆక్రమణలను ఏ రకంగా తొలగించాలి తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. బుడమేరే కాకుండా కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందని, ఇటు బుడమేరు, అటు కొల్లేరును కూడా కాపాడాల్సిన అవసరం ఉందని రామకృష్ణ స్పష్టం చేశారు.