Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

హోదా, విభజన హామీల కోసం 20 నుంచి బస్సుయాత్ర

హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు…
విద్యార్థి, యువజన సంఘాల నిర్ణయం
విద్యార్థులు, యువత ముందుకు రావడం సంతోషం: రామకృష్ణ
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

విశాలాంధ్ర`విజయవాడ: పోరాటంతోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించుకుందామని నాయకులు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేకహోదా సాధన సమితి అధ్వర్యంలో మంగళవారం విజయవాడ దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు శివారెడ్డి, అశోక్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కోసం యువజన, విద్యార్థి సంఘాల నాయకత్వాన రాష్ట్రవ్యాప్తంగా బసు యాత్ర చేపట్టాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది. జనవరి 20న హిందూపురంలో ప్రారంభమైన బసుయాత్ర ఇచ్ఛాపురం వరకు 15 రోజులు కొనసాగుతుంది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ హోదా, విభజన హామీల కోసం విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమం చేపట్టడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌ దిల్లీ పెద్దలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు…వాటిని మీడియాకు విడుదల చేస్తున్నారు…కానీ ఆ విన్నపాలపై కేంద్రం ఏమి చెప్పిందో వెల్లడిరచడం లేదని విమర్శించారు. కేంద్రమైనా మాట్లాడుతుందా అంటే అదీ కనిపించడం లేదన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలపై విద్యారి, యువజన సంఘాలు దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు, యువత ఉద్యమిస్తే తప్ప పాలకులు దిగిరారన్నారు. విద్యార్థి, యువజనులు చేపట్టిన బస్సుయాత్ర జనవరి 26న విజయవాడలో ఉండేలా షెడ్యూల్‌ రూపొందించుకోవాలని సూచించారు. రిపబ్లిక్‌ డే నాడు విజయవాడలో జాతీయ పతాకం ఎగురవేసి భారీఎత్తున డిమాండ్‌ చేస్తే దేశవ్యాప్తంగా ప్రాధాన్యత లభిస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రత్యేకహోదా డిమాండ్‌ను ప్రధాన పార్టీలు బయటకు తీస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పోరాడి…ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామిని నేరవేర్చుతారా? లేదా? అని నిలదీయాలన్నారు. హోదా ఉద్యమంలో బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ప్రత్యేకహోదాపై కేంద్ర పెద్దలను నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నాయకులను కోరారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ అశాస్త్రీయంగా పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగిన తీరుకు తానే ప్రత్యక్షసాక్షినని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా బీజేపీ డిమాండ్‌ చేస్తే పాలక పార్టీగా కాంగ్రెస్‌ హోదా హామీ ఇచ్చిందన్నారు. దీనిని మోదీ సర్కారు అమలు చేయడం లేదని విమర్శించారు. మిత్రపక్షంగా ఉండి కూడా 2014 నుంచి 2019 వరకు హోదాపై టీడీపీ పోరాడిరదన్నారు. ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. 22మంది వైసీపీ ఎంపీలు పార్లమెంటులో నోరెత్తడం లేదన్నారు. సీబీఐ కేసులకు భయపడుతున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్‌ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ పనికిమాలిన మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బస్‌యాత్ర ఉద్యమానికి ఆహ్వానించాలని సూచించారు. బస్‌యాత్రకు అనుమతి నిరాకరించినా మరో రూపంలోనైనా ఉద్యమంచాలని కోరారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు కరువైందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నా సీఎం జగన్‌ మాట్లాడటం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ చంద్రబాబు వైఫల్యాలపై గట్టిపునాదులు వేసుకుని జగన్‌ పార్లమెంట్‌ వరకు ఎదిగారని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కనీసం పులివెందులకు కూడా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, టీడీపీ నాయకులు లింగమనేని శివరామ్‌ప్రసాద్‌, నవతరం పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరువది సుబ్బారావు, ఏఐటీయూసీ నాయకులు వెంకట సుబ్బయ్య, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు రవిచంద్ర, భాస్కర్‌, రాజేశ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి వేముల శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న, నాయకులు శ్యామ్‌, సంతోశ్‌, కారుమంచి సుభాని, యుగంధర్‌, సుబ్బారావు, మోతుకూరి అరుణ్‌కుమార్‌, లంకా గోవిందరాజులు, ఎం.సాయికుమార్‌, షేక్‌ వలి, జంగాల చైతన్య, చీకటి సైదారావు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రానాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img