Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు గెలుపు

. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అత్తెసరు మెజార్టీ
. ఉత్తరాంధ్రలో పారని రాజధాని పాచిక
. సీమలోనూ ప్రభుత్వ వ్యతిరేకత

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని ఈ ఫలితాలను చూసి పాలకపక్ష పెద్దలు కంగుతిన్నారు. ఈనెల 13వ తేదీ స్థానిక సంస్థలతో పాటు గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ శాసనసమండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. మొత్తం 9 స్థానిక సంస్థలతో పాటు మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్‌ చేయడంతో సహజంగానే ఆ 9 స్థానాలను వైసీపీ గెల్చుకుంది. అయితే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలను కూడా అధికారపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో మొత్తం 14 స్థానాలు గెల్చుకుని తన ఖాతాలో వేసుకోవాలని, ఇందుకోసం ఓట్ల చేర్పింపు దగ్గర నుంచి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా మంత్రులు, శాసనసభ్యులను కేటాయించి, వాటి గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు పెద్దఎత్తున ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడ్డారు. ఓటరు జాబితా ఆధారంగా విపక్షాలు పెద్దసంఖ్యలో దొంగ ఓట్లను బయటపెట్టాయి. ఎన్నికల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశాయి. పోలింగ్‌ రోజున కూడా దొంగ ఓటర్లను విపక్షాలు పట్టుకున్నాయి. తిరుపతిలో ఒక భార్యకు 18 మంది భర్తలున్నట్లు ఓటరు లిస్టులో నమోదైంది. అసలు అక్కడ ఇల్లే లేకుండా 14 ఓట్లు నమోదయ్యాయి. టెన్త్‌ విద్యార్థులు, నిరక్షరాశ్యులు కూడా గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదయ్యారు. ఇలా అనేక దొంగ ఓట్లను విపక్ష నేతలు గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు తీసుకోలేదు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రైవేటు స్కూలు టీచర్‌ల పేరుతో అధికారపార్టీ నేతలు పెద్దసంఖ్యలో దొంగ ఓట్లు చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారపార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసేలా ఎంఈవోల దగ్గర నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఉపాధ్యాయులపై తమ అధికారాన్ని ప్రయోగించారు. అలాగే ముఖ్యంగా ప్రైవేటు టీచర్లకు ఓటుకి రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వడంతోపాటు సెల్‌ఫోన్లు, ట్యాబులు వంటి వివిధ రూపాల్లో బహుమతులిచ్చి ప్రలోభాలకు గురిచేశారు. మొత్తానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా అధికారం, అంగ, అర్థబలం ఉపయోగించినా ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం వైసీపీని చావుదెబ్బ తీసింది. మిగిలిన అన్ని స్థానాల కంటే ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించారు. పరిపాలనా రాజధాని విశాఖకు మార్చడానికి ఈ ఎన్నిక రిఫరెండంగా కూడా మంత్రులు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విశాఖలో ఈనెల 3,4 తేదీల్లో జరిగిన పారిశ్రామిక సదస్సులో త్వరలోనే విశాఖ నుంచి రాష్ట్ర పాలన మొదలవుతుందని ప్రకటించారు. ఆ తర్వాత జులై నుంచి విశాఖకు తరలివెళుతున్నామని సీఎం మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తరాంధ్ర ఓటర్లు తమకు అభివృద్ధి తప్ప, రాజధాని అవసరం లేదని తేల్చిచెప్పారు. అమరావతి రైతుల దగ్గర రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములు తీసుకుని, వారిని ఇబ్బందిపెట్టడం సరికాదని ప్రభుత్వానికి తెలియజెప్పారు. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును భారీ మెజార్టీతో గెలిపించి అధికారపార్టీకి షాక్‌ ఇచ్చారు. కడపఅనంతపురంకర్నూలు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి కల్పించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డికి, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత కూడా వైసీపీ అభ్యర్థి కేవలం 1400 మెజార్టీతో ఉండగా, లెక్కింపు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశంనెల్లూరు`చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో కేవలం 1043 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించగా, మిగిలిన గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీకి ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img