Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంతా గందరగోళం

సచివాలయ ఉద్యోగుల ఆశలు ఆవిరి

రెండేళ్ల తర్వాత పర్మినెంట్‌కు మెలిక
తెరపైకి సీబీఏఎస్‌ విధానం
అర్హతా మార్కులే గీటురాయి

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు రెండేళ్లలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఈ వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధానం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం క్రెడెట్‌ బేస్‌డ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌ (సీబీఏఎస్‌) పరీక్షను ప్రభుత్వం ప్రతిపాదించడంపై గందరగోళం ఏర్పడుతోంది. రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో దాదాపుగా లక్షా 40వేల మందిని నియమించారు. రెండేళ్లు విజయవంతంగా విధులు నిర్వహించిన వారిని క్రమబద్ధీకరిస్తామని నాడు ప్రకటించి, ఇప్పుడు ప్రొబెషన్‌ పరీక్షలో అర్హత సాధించిన వారినే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్న నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానంపై సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ విభాగాల పరీక్షల తరహాగా రెండంచెలుగా పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారినే ఎంపిక చేయాలని ప్రతిపాదించింది. ఈ పరీక్షకు వెళ్లాలంటే 70శాతం విధులు నిర్వహించి ఉండాలని, 100 మార్కులతో రెండు విభాగాలుగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. విధివిధానాలు, సిలబస్‌పై గ్రామ, సచివాలయ విభాగం ఉన్నతాధికారులు కసరత్తులో నిమగ్నమయ్యారు.
ఉద్యోగుల అసంతృప్తి
ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అతిత్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటామని ఆశించిన వారి ఆశలు అడియాశలుగా మారాయి. ఆరు నెలల ముందస్తుగానైనా గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి

ఉంటే బాగుండేది. అలాంటి ప్రయత్నమేమీ చేపట్టకుండా, ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయ్యాక ప్రొబెషనరీ టెస్ట్‌ విధానాన్ని తేవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారినే పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. అర్హత సాధించని వారంతా మళ్లీ పరీక్షలు రాసుకుంటూ ఉండాల్సిందే. ఇప్పటివరకూ కేవలం రూ.15వేల స్టైఫెండ్‌తోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో అధికశాతం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారానే అమలవుతున్నాయి. అందులో నూతనంగా నియమితులైన ఉద్యోగుల పాత్ర క్రియాశీలకంగా ఉంది. కరోనా కేసుల గుర్తింపు నుంచి ప్రజలకు వాక్సిన్‌ వేయించేంత వరకు ఉద్యోగుల కృషి ఉంది. వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతోంది. వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా భారీగా ఉద్యోగాలు కల్పించారు. ఈ ప్రభావంతో డీఎస్సీటీచర్స్‌, పోలీసు, ఏపీపీఎస్సీ నుంచి వచ్చే ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండరులో కుదించేశారు. ఈ జాబ్‌ క్యాలెండరును నిరసిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి దశల వారీగా ఉద్యమాల్ని నిర్వహిస్తోంది. అటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకుంటే మరో ఉద్యమం తలెత్తే అవకాశముంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తే ఆర్థికభారం పడుతుందన్న వ్యూహంతోనే ప్రభుత్వం ప్రొబెషనరీ విధానాన్ని ప్రవేశపెట్టిందనే విమర్శలున్నాయి. అంతా అయోమయం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చాలామంది గ్రామ, వార్డు సచివాలయాలకు నిర్వహించిన పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్న ధీమాతో ఉన్న వారంతా ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో పీజీ నుంచి డిగ్రీ అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌తోపాటు వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులు చేసి, ఆయా విభాగాల పోస్టులకు ఎంపికయ్యారు. గ్రూప్‌1,2, డీఎస్సీ, పోలీస్‌ తదితర ఉద్యోగాలకు తయారవుతున్న అభ్యర్థులూ అధికంగా గ్రామ సచివాలయాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనే నమ్మకంతో వారంతా మిగిలిన పోటీ పరీక్షలపై దృష్టి కేంద్రీకరించలేదు. ఇతర ఉద్యోగాలకు ప్రయత్నిద్దామంటే..రాష్ట్రంలో ఆ దిశగా ఉద్యోగ ఖాళీలు లేవు. చాలామంది వయోపరిమితి మించిపోయింది. తమను పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img