Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంతా హడావుడే…

. జీ20 సదస్సుకు తొలి రోజు నామమాత్రంగా ప్రతినిధులు
. డీలా పడిన అధికారులు… ప్రజాప్రతినిధులు
. సాగర తీరంలో మెరుపులతో ప్రజాధనం వృథా

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం : అంతన్నారు… ఇంతన్నారు… విశాఖ అభివృద్ధి మేడిపండు చందంగా అహో ఓహో అంటూ జీ20 సదస్సు పేరిట రూ.150 కోట్లు ఖర్చు చేసి రెండు నెలలుగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సదస్సుకు 200 మంది అతిథులు వస్తారని హంగులు, రంగులతో సాగర తీరాన్ని, వారొచ్చే మార్గాన్ని మాత్రమే అభివృద్ధి చేశారు. అయితే తొలిరోజు ప్రతిని ధుల హాజరు నామమాత్రంగా ఉండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు తీవ్ర నిరాశ ఎదురయింది. 63 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని, సోమవారం సాయంత్రానికే 57 మంది విశాఖ చేరుకున్నారని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం వచ్చిన వారిలో అనేకమంది వారి సహాయకులే ప్రతినిధులుగా ఉండటం గమనార్హం. కేవలం వంద మంది మాత్రమే ప్రతినిధులుగా తొలి రోజు సదస్సుకు హాజరైనట్లు సమాచారం. ఇందులో విదేశీ ప్రతినిధులు కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే ఉంటారని, మిగతా వారంతా వారి సహాయకులేనని అక్కడున్న కొంతమంది అధికారులు అంటున్నారు. కేవలం సాంస్కృతిక సంబరాలకే రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు. పోలీసులు యూనిఫామ్‌తో కాకుండా 150 మంది వరకూ డ్రెస్‌ కోడ్‌తో భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. మరో పక్క మీడియా ప్రతినిధులకు ఎలాంటి అనుమతి లేదు. కొంతమందికే పీఐబీ అధికారులు పాసులు మంజూరు చేసినప్పటికీ సమావేశాల వేదిక లోపలికి అనుమతి లేకుండా పోయింది. తొలిరోజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ మంగళవారం ఉదయం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ప్రారం భమైంది. సాగరిక హాల్లో ప్రతినిధులు అంతా కలిపి 50 మంది కూడా ఉండరని కొంతమంది అధికారులు తెలియజేశారు. అయితే విదేశీ ప్రతినిధులకు విశాఖ అందాలను చూపించేం దుకు జీవీఎంసీ అధికారులు నానా తంటాలు పడ్డారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతినిధులు వచ్చే రోడ్డు మార్గం వెంబడి పెయింటింగ్‌లు, గ్రీన్‌ బెల్ట్‌ ఆధునీకరణ, విద్యుదీకరణతో పాటు రోడ్లు నిర్మించారు. అసీలుమెట్ట ఫ్లై ఓవర్‌ పైన రోడ్లు తళతళ మెరుస్తుంటే, క్రింద ప్రజలు వెళ్లే రహదారులన్నీ గోతులతో నరకప్రాయంగా మారాయి. అధికారులు కేవలం విదేశీ ప్రతినిధులకు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులకు మాత్రమే రెడ్‌ కార్పెట్‌ వేసి, విశాఖ ఓహో అహో అనిపించేలా సాగర తీరంలో మెరుపులతో ప్రజాధనాన్ని వృథా చేశారని అనేక ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీఎం జగన్‌ విశాఖలో నివాసం ఉండడానికి వస్తున్నందున సాగర తీరంలో జీ20 పేరిట ఈ సుందరీకరణ అభివృద్ధి పనులు చేపట్టారని మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img