Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అగ్రిగోల్డ్‌ బాధితులపై వివక్ష ఎందుకు?

సీఎం హామీ నిలబెట్టుకోవాలి
31న భేటీకి అవకాశం ఇవ్వాలి
రూ.200 కోట్లతో ఎన్నేళ్లు గడుపుతారు?
ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఈవీ నాయుడు, తిరుపతిరావు, చంద్రశేఖర్‌
విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల రిలే దీక్షలు ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండు చేశారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ఆంధ్రప్రదేశ్‌ అధ్వర్యంలో గురువారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షాశిబిరాన్ని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. అమరులైన అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అసోసియేషన్‌ నేతలు తరలివచ్చి దీక్షలకు సంఫీుభావం తెలిపారు.
అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ ఉద్యమం ప్రభావంతో అగ్రిగోల్డ్‌ బాధితులకు నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యం, నాటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, వాటి జాప్యం అంశాల్ని సమగ్రంగా వివరించారు. సంక్షేమం పేరిట లక్షా 36వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం..అగ్రిగోల్డ్‌ బాధితులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. వారిని ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందా? అని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.200 కోట్లు చొప్పున పెడితే, ఎన్నాళ్లకు మొత్తం చెల్లిస్తారని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని, దాంతోనే ఆయనకు బాధితులు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. జగన్‌ పాదయాత్రలోను, ఎన్నికల మేనిఫెస్టోలోను ఇచ్చిన హామీలను నమ్మి, ఆయనకు ఓట్లేసి గెలిపించారన్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అగ్రిగోల్డ్‌ బాధితులు కీలక భూమిక పోషించారన్నారు. ఈ ప్రభుత్వ జాప్యం

కారణంగా..ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన బాధితులంతా మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి సైతం బాధితుల ఆర్తనాదాలను మానవతా దృక్పథంతో గమనించి, పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. చివరి బాధితుడి వరకూ పరిహారం అందిచడమే అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ లక్ష్యమని నొక్కిచెప్పారు. రెండేళ్లపాటు వేచిచూసిన తర్వాతే దీక్షలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 28లోగా సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. లేకుంటే 31వ తేదీన జిల్లాకు 50మంది చొప్పున 650 మంది సీఎం క్యాంపు కార్యాలయానికి వెళతామని, సీఎం జగన్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. ఆ సమయంలో అక్కడకు తరలివచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య శాశ్వత పరిష్కారానికిగాను, వారికి భరోసా ఇచ్చేలా సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరాతామన్నారు. బాధితులకు సొమ్ము చెల్లించేందుకు సంక్షేమ క్యాలెండరులో ప్రభుత్వం చోటు కల్పించాలన్నారు.
అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ నాడు అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపినందునే సాగనంపారని గుర్తుచేశారు. అదే తప్పిదాన్ని జగన్‌ ప్రభుత్వం చేయకపోతే మంచిదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అగ్రిగోల్డ్‌ బాధితుల ఓట్లు, అండదండలు ఉన్నాయన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల్ని ప్రభుత్వం మానవత్వంతో పరిష్కరించాలని, లేకుంటే రెట్టింపు ఉద్యమాలు చేపట్టగల సత్తా అసోసియేషన్‌కు ఉందని చెప్పారు. ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు మాట్లాడుతూ డిపాజిట్ల సొమ్ము చివరి బాధితునికి అందేలా చర్యలు తీసుకునేందుకుగాను ఉన్నతాధికారులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌ మాట్లాడుతూ సీఎం జోక్యం చేసుకుని అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన ఈవీ నాయుడు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులకు సొమ్ము చెల్లింపులో ప్రభుత్వ జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలిరోజు 15 మంది రిలే దీక్షలు
తొలిరోజు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది రిలే దీక్షలు నిర్వహించారు. కారుపర్తి గగన్‌, గండ్ర వీరభద్రరావు, వీఎల్‌ నరసింహారావు, బి.సూర్యనారాయణ, ఎం.అశోక్‌కుమార్‌, బి.రాంబాబు, ఎం.సాంబశివరావు, వి.నాగబాబు, ఏవీ రాంబాబు, చెలెక జగన్‌మోహన్‌రావు దీక్షలు చేపట్టారు. వై.నాగలక్ష్మీ, పి.శ్రీనివాస్‌, ఎన్‌.రామ శ్రీనివాస్‌, డి.నాగిరెడ్డి, గుంటూరు జిల్లా నుంచి పి.గణేష్‌రెడ్డి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షలకు అఫ్సర్‌, వివిధ జిల్లాల అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఎస్‌.మల్లికార్జున, పి.నాగరాజు, కె.చంద్రశేఖర్‌. బి.వీరాంజనేయులు సంఫీుభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్‌.పిచ్చయ్య విప్లవ గీతాలు ఆలపించారు. తొలిరోజు రిలే దీక్షలో ఉన్న వారికి అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు అంజనీదేవి, గణపతి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img