Friday, April 19, 2024
Friday, April 19, 2024

అట్టుడికిన పార్లమెంటు

పెగాసస్‌, సాగు చట్టాలపై చర్చకు విపక్షాల పట్టు

గందరగోళం నడుమ ఉభయ సభలు వాయిదా
నినాదాలు, నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం
ఆరుగురు టీఎంసీ సభ్యులపై రాజ్యసభ సస్పెన్షన్‌

న్యూదిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరో తొమ్మిది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తమ ఆందోళనను ప్రతిపక్షాలు తీవ్రతరం చేశాయి. బుధవారం తమ గళాన్ని విపక్షాలు మరింత బలంగా వినిపించాయి. పెగాసస్‌పై దర్యాప్తు, సాగు చట్టాల రద్దు తదితర అంశాలపై చర్చకు ముక్తకంఠంతో డిమాండు చేశారు. సాగు చట్టాల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమాధానం ఇవ్వాలని పట్టు పట్టారు. మోదీ సర్కార్‌ తమ ఐక్యతకు భంగం కలిగించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నదంటూ దుయ్యబట్టారు. దీంతో పార్లమెంటు అట్టుడికిపో యింది. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపినందుకు ఆరుగురు టీఎంసీ ఎంపీలు రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. లోక్‌సభ వరుస వాయిదాల తర్వాత తిరిగి 3.30 గంటలకు సమావేశం కాగా కొబ్బరి అభివృద్ధి బోర్డు (సవరణ) బిల్లు, 2021ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగు తుండటంతో బిల్లుపై చర్చ జరపకుండానే సభాపతి రాజేంద్ర అగర్వాల్‌ దానిని ఆమోదించేశారు. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించింది. హడావిడిగా బిల్లును ఆమోదించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయగా మరింత గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఉదయం సభ మొదలైనప్పుడు ఎనిమిది మంది మాజీ సభ్యులకు స్పీకర్‌ ఓం బిర్లా సంతాపం తెలుపగా సభికులు నివాళులర్పించారు. అనంతరం దేశ రాజధాని ప్రాంతం, పరిసరాల్లో వాయు నాణ్యత నియంత్రణ బిల్లు 2021ని పర్యావరణ శాఖ మంత్రి భుపేందర్‌ యాదవ్‌ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అటు రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు, 2021ని ఆమోదించారు. ఈ బిల్లుపై స్వల్ప చర్చ జరిగింది. దీనిని జులై 29న లోక్‌సభ ఆమోదించింది. చిన్నపాటి చర్చ తర్వాత పరిమిత జవాబుదారీ భాగస్వామ్య (సవరణ) బిల్లు, 2021Ñ డిపాజిట్‌ బీమా, రుణహామీ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు 2021లకూ ఆమోదం లభించింది. పెగాసస్‌ వ్యవహారంలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు ఆరుగురు టీఎంసీ ఎంపీలపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సస్పెన్షన్‌ విధించారు. ఎంపీలు డోలా సేన్‌, నదీముల్‌ హక్‌, అబిర్‌ రంజన్‌ బిశ్వాస్‌, శాంతా భెట్రీ, అర్పితా ఘోష్‌, మౌసమ్‌ నూర్‌లను ఒక రోజు సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ ప్రారంభమైన వెంటనే వీరు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలుపడంతో నిబంధన 255 కింద కౌన్సిల్‌ నుంచి ఎంపీలను వెంటనే ఉపసంహరించాలని చైర్మన్‌ ఆదేశాలిచ్చారు. కాగా, కొత్త సాగు చట్టాల వ్యతిరేక రైతుల పోరుపై నిబంధన 267 కింద సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాంగోపల్‌ యాదవ్‌, విషంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌, సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌లు ఇచ్చిన నోటీసులను స్వీకరించని వెంకయ్య ఇది కీలకమైన అంశం కాబట్టి మరొక నిబంధన కింద చర్చకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వం, టీఎంసీకి చెందిన సుఖేందు రాయ్‌, కాంగ్రెస్‌ సభ్యులు మల్లిఖార్జున్‌ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, సీపీఎం ఎంపీలు కరీం, వి.శివదాసన్‌ సమర్పించిన పెగాసస్‌ సంబంధిత నోటీసులను తిరస్కరించారు. రైతుల నిరసన, ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితి వంటి సమస్యలపై చర్చించవచ్చునని చైర్మన్‌ చెప్పారు. ఇంతలోనే టీఎంసీ ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లగా తమ స్థానాల్లో కూర్చోవాలని వెంకయ్య సూచించినా వినకపోవడంతో ఆరుగురిని వెంకయ్య నాయుడు సస్పెండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img