Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అట్టుడుకుతున్న శ్రీలంక

తారస్థాయికి చేరిన హింస… 8కి చేరిన మృతులు
200 మందికి పైగా గాయాలు

కొలంబో : శ్రీలంకలో హింస తారస్థాయికి చేరింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కొలంబో, ఇతర నగరాల్లో జరిగిన హింసలో 200 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంక ప్రధాన మంత్రి 76 ఏళ్ల మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్స మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడి చేసిన కొన్ని గంటల తర్వాత, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి, రాజధానిలో సైనిక దళాలను మోహరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హింసాకాండలో హంబన్‌టోటాలోని రాజపక్స పూర్వీకుల ఇంటితో సహా అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్లపై కాల్పులు జరిగాయి.
హంబన్‌టోట నగరంలోని మెదములానాలో ప్రధాని మహింద రాజపక్స, ఆయన తమ్ముడు, అధ్యక్షుడు గొటాబయ రాజపక్స ఇల్లు మొత్తం దగ్ధమవుతున్నట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. కురునెగలలోని ప్రధాని మహింద ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. అయితే ఒక గుంపు హంబన్‌తోటలోని మెదములానాలో మహిందా, గొటాబయ తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన రాజపక్స స్మారకాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కాగా ఇమదువ ప్రాంతీయ సభ చైర్మన్‌ ఎ.వి.శరత్‌ కుమార నివాసంపై సోమవారం దాడి జరగడంతో ఆయనకు గుండె పోటు వచ్చి మరణించారు. నెగొంబోలోని ప్రముఖ హోటల్‌పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. లక్షలాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు పూర్తిగా ధ్వంసమ య్యాయి. ఎస్‌ఎస్‌ఎల్‌పీ పార్లమెంటు సభ్యుడు అమరకీర్తి అతుకోరాల, ఆయన సెక్యూరిటీ గార్డు సోమవారం నిట్టంబువాలో మరణించారు. టెంపుల్‌ ట్రీస్‌, రాష్ట్రపతి కార్యాలయం ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడికి నిరసనగా నిట్టంబువకు పార్లమెంటు సభ్యుడితో పాటు వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల ఘటనలో 27 ఏళ్ల యువకుడు చనిపోయాడు. వీరకేటియ ప్రాదేశిక సభ చైర్మన్‌ నివాసం వద్ద సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. కొలంబోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. కనీసం 217 మంది చికిత్స కోసం చేరినట్లు కొలంబో జాతీయ ఆసుపత్రి తెలిపింది. అధికార కూటమికి చెందిన మంత్రులు, శాసన సభ్యులకు చెందిన అనేక ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బాదుల్లా జిల్లా పార్లమెంటేరియన్‌ తిస్సా కుట్టియారాచ్‌ ఇంటిపై కూడా నిరసనకారులు దాడి చేసి, ఆపై నిప్పంటించారు. ఈ దాడిలో పుట్టలం ఎంపీ శాంత నిశాంత ఇల్లు పూర్తిగా దగ్ధమయింది. గత నెల రోజులుగా పెరుగుతున్న ధరలు, విద్యుత్‌ కోతలపై నిరసనలు కొనసాగుతున్నాయి. 1948లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభానికి కొంతవరకు విదేశీ కరెన్సీ కొరత కారణంగా కనిపిస్తోంది. దీని అర్థం దేశం ప్రధానమైన ఆహారాలు, ఇంధనం దిగుమతుల కోసం డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిరది. ముఖ్యమైన దిగుమతుల కోసం ప్రభుత్వం వద్ద డబ్బు అయిపోయినందున, అధ్యక్షుడు గొటాబయ, ఆయన సోదరుడు మహింద రాజీనామా చేయాలని కోరుతూ ఏప్రిల్‌ 9 నుంచి శ్రీలంక అంతటా వేలాది మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చారు.
సైన్యానికి ఎమర్జెన్సీ అధికారాలు
శ్రీలంక పరిస్థితి నానాటికీ చేతులు దాటిపోతోంది. తాజాగా సైన్యం, పోలీసులకు ఎమర్జెన్సీ అధికారాలను అప్పగిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన ప్రత్యేక కేబినెట్‌ సమావేశంలో అధ్యక్షుడు గొటాబయ రాజపక్స శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేలా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శ్రీలంకలో కేవలం ఒక నెల వ్యవధిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది రెండోసారి.
నౌకాదళ స్థావరంలో తలదాచుకున్న మాజీ ప్రధాని మహింద, కుటుంబం
శ్రీలంకలో హింసాకాండ నేపథ్యంలో మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబం మంగళవారం భారీ భద్రతతో కొలంబో నుంచి బయలుదేరిన తర్వాత ట్రింకోమలీలోని నౌకాదళ స్థావరంలో తలదాచుకున్నారు.
రాజపక్స, ఆయన భార్య శిరంతి, వారి చిన్న కుమారుడు రోహిత, ఆయన కుటుంబం మంగళవారం తెల్లవారుజామున ప్రధాని అధికారిక నివాసం టెంపుల్‌ ట్రీస్‌ నుంచి వైమానిక దళం హెలికాప్టర్‌లో బయలుదేరి భారీ కాపలా ఉన్న నౌకాదళ స్థావరంలో తలదాచుకున్నట్లు సమాచారం. అలాగే రాజపక్స రెండవ కుమారుడు, మాజీ ప్రధాని కార్యదర్శి యోసిత, ఆయన కుటుంబం సోమవారం దేశం విడిచి వెళ్లినట్లు కూడా నివేదికలు వెల్లడిరచాయి. సోమవారం రాజపక్స రాజీనామా చేయడం, ప్రభుత్వ అనుకూల నిరసనకారులు ప్రారంభించిన హింసాకాండ తర్వాత, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు టెంపుల్‌ ట్రీస్‌ను చుట్టుముట్టారు. బలవంతంగా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో సైన్యం రాజపక్సను రక్షణగా నిలిచారు. హింసాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. ప్రతీకారంగా నిరసనకారులు నివాసం వెలుపల నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారు. దీంతో సైన్యం గాలిలోకి కాల్పులు జరిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img