Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అదానీ, అంబానీలతో బంధానికి ఆరాటం

. రాష్ట్ర వనరుల అప్పగింతకు ప్రయత్నం
. కొత్త పరిశ్రమలు తర్వాత… విశాఖ ఉక్కు సంగతేంటి?

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూలను తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే, ఇప్పుడు విశాఖ వేదికగా కుదిరిన అవగాహన ఒప్పందాలను తదుపరి ప్రభుత్వం రద్దు చేయదన్న హామీ ఏమీ లేదని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు, ప్రజలు, ప్రతిపక్షాలు సైతం వచ్చే ఏడాది జరిగే ఎన్నికల లోపు అచరణలోకి వస్తాయా అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నాయి. ఎన్ని ఒప్పందాలు కుదిరాయన్నది ముఖ్యం కాదు…ఎన్ని ఆచరణలో పెట్టామనేదే కీలకమని అంటున్నారు. రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లో గ్రీన్‌ హైడ్రోప్రాజెక్టులు రూ.8.5 లక్షల కోట్లు. మనదేశంలో గ్రీన్‌ హైడ్రోప్రాజెక్టులు ఎక్కడైనా ప్రారం భించారా అన్న సందేహం అందరిలోనూ నెలకొన్నది. కనీసం ఈ గ్రీన్‌ హైడ్రో ప్రాజెక్టులకు డీపీఆర్‌ సిద్ధం చేశారా? ఎన్నేళ్లకు డీపీఆర్‌ వస్తుందన్న అనుమానాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. వాస్తవంగా పవర్‌ ప్రాజెక్టుల కోసం 15 ఏళ్ల క్రితం కృష్ణపట్నం వద్ద అంబానీకి కేటాయించిన 5 వేల ఎకరాలు, 10 మెగావాట్ల డేటా సెంటర్‌ కోసం అదానీ కంపెనీకి విశాఖ రిషికొండ వద్ద కేటాయించిన ప్రాంతాల్లో కనీసం పునాదిరాయి కూడా పడలేదు. తాజాగా ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో 400 మెగావాట్ల డేటా సెంటర్‌ కోసం మళ్లీ ఒప్పందాలు చేయడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. విలువైన 45 వేల

ఎకరాల భూమిని బడాకార్పొరేట్‌ దిగ్గజాలకు కట్టబెట్టడానికే ఈ ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదానీతో జరిగిన గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, జెంకో ఒప్పందాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుంటుందా? కొనసాగిస్తుందా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే…వైసీపీ పట్టించుకోవడం లేదు. పార్లమెంట్‌లో 32 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కార్మికసంఘాల నేతలు మండిపడుతున్నారు. లక్ష మందికి పైగా జీవనోపాధి కల్పిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే నిజమైన పారిశ్రామిక అభివృద్ధి అని ఉద్యోగులు, కార్మికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు పెట్టడానికి వందలాది పరిశ్రమలు పరుగులు పెడతాయి. దీనికోసం ప్రత్యేకంగా సమ్మిట్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. హోదాపై జగన్‌ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడం దారుణంగా కనిపిస్తోంది. హోదాను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఎలా నమ్మాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల కోసమే గ్లోబల్‌ సమ్మిట్‌ పేరిట హైడ్రామా చేశారని విపక్షాల నేతలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఖాయిలాపడిన ఆరు చక్కెర ఫ్యాక్టరీలు, ఐదు కాంపోజిట్‌ భారీ జ్యూట్‌ మిల్లులు, ఫెర్రో అలాయిస్‌ పరిశ్రమలు, డెయిరీలు తెరిపించలేని ఈ ప్రభుత్వం…కొత్త పరిశ్రమలు తీసుకువస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా, సులభతర వ్యాపారం పేరుతో కార్మికులు, ఉద్యోగుల జీతాలు పెరగకుండా, పని భద్రత లేకుండా పారిశ్రామిక అభివృద్ధి ఎలా సాధ్యమని మేధావులు అడుగుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img