Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అద్దెకి…అమ్మకానికి !

రాజధాని నగరాల్లో ఎటు చూసినా ‘టు లెట్‌, ఫర్‌ సేల్‌’ బోర్డులే
అమరావతి నిర్మాణం నిలిపివేతతో తలకిందులైన పరిస్థితులు
నెలల తరబడి ఖాళీగా ఉంటున్న ఇళ్లు, ఫ్ల్లాట్‌లు
మూతపడుతున్న గెస్ట్‌హౌస్‌లు, రెస్టారెంట్లు
హోటళ్లు, లాడ్జిల పరిస్థితి మరింత దయనీయం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని విజయవాడ, గుంటూరు జంట నగరాల్లో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు ఈ రెండు నగరాల్లో ఇల్లు కాని,అపార్ట్‌మెంట్‌ కాని, చివరకు హోటల్‌లో గది సైతం వెంటనే దొరకడం గగనమయ్యేది. అటువంటిది ప్రస్తుతం ఈ రాజధాని నగరాల్లో ఎటు చూసినా టు లెట్‌, ఫర్‌ సేల్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏ వీధి కెళ్లినా, ఏ అపార్ట్‌మెంట్‌ చూసినా పదుల సంఖ్యలో ‘టు లెట్‌’ బోర్డులు కనపడుతున్నాయి. పెద్ద అపార్ట్‌మెంట్లలో అయితే కనీసం నాలుగైదు ప్లాట్‌లు ఖాళీగా ఉంటున్నాయి. గతంలో కంటే అద్దె తగ్గించినా నెలల తరబడి భర్తీ కావడం లేదు. కొన్ని ఆపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, సొంత గృహాల్లోని పోర్షన్లు, స్టూడెంట్స్‌కు ఇచ్చే రూమ్‌లు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక హోటళ్లలో ే 40శాతం గదులు కూడా నిండడం లేదు. స్టార్‌ హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిర్వహణా భారం భరించలేక చాలా మంది సిబ్బందిని ఆయా హోటళ్ల యాజమాన్యాలు తగ్గించుకున్నాయి. ఇక కొత్తగా పెట్టిన గెస్ట్‌హౌస్‌లు, కొన్ని రెస్టారెంట్లు బేరాల్లేక పూర్తిగా మూతపడ్డాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, గుంటూరు నగరాల్లో అమరావతి పేరుతో నూతన ఆధునిక నగర నిర్మాణానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి ఈ జంట నగరాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిరది. ముఖ్యంగా 2015లో అప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న సచివాలయ, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వాటిలో పనిచేసే ఉద్యోగులంతా ఇక్కడకు తరలిరావడంతో విజయవాడ,గుంటూరు నగరాలకు జనం తాకిడి బాగా పెరిగింది. ఆ తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో, ఉద్యోగులతో పాటు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేసే వృత్తిదారులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఇక్కడకు తరలివచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు నగరాల్లో జనాభా సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు గిరాకీ ఏర్పడిరది. మరో పక్క అమరావతిలో పర్మినెంట్‌ ప్రభుత్వ భవనాలు నిర్మించేలోగా, తాత్కాలిక భవనాల్లో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తో అద్దె ధరలు ఒక్కసారిగా మిన్నంటాయి. హోటళ్లు, లాడ్జిల్లో కూడా రూమ్‌ రేట్లు ఒక్కసారిగా పెరిగిపో యాయి. ఒక దశలో రూమ్‌ దొరకడం గగనంగా మారే పరిస్థితి నెలకొంది. స్టార్‌ హోటళ్లు కేవలం నాలుగైదు మాత్రమే ఉండడంతో వాటిల్లో దిగడానికి పలుకుబడి కల్గినవారు సిఫార్సు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ డిమాండ్‌ను గమనించిన కొందరు వ్యాపారులు కొత్త అపార్ట్‌మెంట్లని మొత్తంగా లీజుకి తీసుకుని గెస్ట్‌ హౌస్‌లుగా, లాడ్జిలుగా మార్పులు చేశారు. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రంగ ప్రవేశంతో ఆకాశహర్మ్యాలు వెలిశాయి. అప్పటివరకు కేవలం 5 అంతస్తులకే పరిమితమైన అపార్ట్‌మెంట్ల స్థానంలో బహుళ అంతస్థుల భవనాలు నిర్మితమయ్యాయి. విదేశాల నుంచి సైతం రాకపోకలు పెరిగాయి. దీంతో విమాన సర్వీసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటివరకు నామమా త్రంగా ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా వృద్ధి చెందింది. వీటితో సహజంగానే ఈ రెండు నగరాల్లో వాహనాల రద్దీ కూడా గణనీయంగా పెరిగింది. అలా మూడు పూవులు, ఆరుకాయలుగా వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతూ, విజయవాడ, గుంటూరు రూపు రేఖలు రోజురోజుకూ మారిపోతున్న తరుణంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే, తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఈ నగరాల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అప్పటివరకు రేయంబవళ్లూ సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అర్థాంతరంగా నిలిపివేయడం, ఆ తర్వాత రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాలు ఈ నగరాలకు శాపమయ్యాయి. ఆ తర్వాత 9 నెలల వ్యవధిలోనే వచ్చిన కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాలు జత కావడంతో ఈ జంట నగరాలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిరది. దీనికి నిదర్శనం టు లెట్‌ బోర్డులతో పాటు, ఫర్‌ సేల్‌ బోర్డులు కూడా అదే స్థాయిలో దర్శనమిస్తుండడమే.వ్యాపారాల్లేక దివాలా తీసిన వారు ఉన్నవాటిని తెగనమ్ముదామన్నా కొనేవారు దొరకడం లేదు. ఒకనాడు రూ.50 లక్షల ధర పలికిన ఫ్లాట్‌ను ప్రస్తుతం రూ.30 లక్షలకు కూడా కొనడం లేదు. ఇళ్లు, స్థలాలు, పొలాల రేట్లన్నీ దారుణంగా పడిపోయాయి. అద్దెలపై ఆధారపడి జీవించే వృద్ధులు ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి ఖాళీగా ఉండడం వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో జీవించేవారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇకనైనా ఈపరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి, నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img