Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అధికార పార్టీకి అనుకూలంగా ఆర్జెడీ ప్రచారం

. అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు
. పోలీసులు జులుం: 9 మందిపై కేసు

ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా విద్యాశాఖ ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విశాలాంధ్ర – ఆదోని రూరల్‌: ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా విద్యాశాఖ ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అధికారపార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో ప్రతాప్‌రెడ్డి గురువారం అంతర్గత సమావేశాన్ని నిర్వహి స్తుండగా విషయం తెలుసుకున్న అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌), సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు కళాశాల వద్ద నిరసన తెలిపారు. వారిపై పోలీసులు జులుం ప్రదర్శించడమే కాకుండా వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశం జరుగుతున్నదన్న సమాచారం తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి జి.రంగన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సోమన్న, సహాయ కార్యదర్శులు సాబీర్‌ బాషా, విజేంద్ర, ఉపాధ్యక్షులు థామస్‌, శరత్‌కుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు దస్తగిరి, మల్లికార్జున,విజయ్‌ మరో 20మందితో సమావేశ హాల్లో ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆర్జేడి ప్రతాప్‌ రెడ్డి గో బ్యాక్‌, గో బ్యాక్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. విషయం తెలుసుకున్న త్రీటౌన్‌ సీిఐ శ్రీరామ్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించుకోవాలని హుకుం జారీ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనుక అడుగు వేయకుండా విద్యార్థి, సీపీఐ నాయకులు నినాదాలు మిన్నంటాయి. పోలీసులకు, విద్యార్థిసంఘాల నాయకులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ వినోద్‌కుమార్‌, వన్‌టౌన్‌ సీఐ విక్రమ సింహ హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొన్నారు. నిరసనకారులను బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులపై జులుం ప్రదర్శించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ జులుంలో సోమన్నకు గాయమైంది. ఈ సందర్భంగా జి.రంగన్న మాట్లాడుతూ ఆర్జేడి ప్రతాప్‌రెడ్డి కర్నూలు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్‌ ఇస్తామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆఫర్‌ ఇచ్చినట్లు విద్యార్థి, ప్రజాసంఘాలు తెలిపాయి. అందులో భాగంగానే ఆదోని పట్టణంలో జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో ప్రధానోపాధ్యాయుల సమావేశం పేరుతో ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులకు డబ్బు, బహుమతుల ఎరవేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలాగా ఆర్జేడి ప్రతాపరెడ్డి వ్యవహరించడం విచారకరమన్నారు. ఇప్పటికే అధికార పార్టీ దొంగ ఓట్లు నమోదు చేసుకున్నదన్నారు. దాడులతో, అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img