Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అన్నదాతల కష్టం నీటిపాలు

. మెట్ట ప్రాంతంలో వడగండ్ల వాన
. నేలకొరిగిన మొక్కజొన్న
. మండవల్లి, ముదినేపల్లిలో మినుము రైతులకు నష్టం

విశాలాంధ్రబ్యూరో – ఏలూరు : పెట్టుబడులు కూడా రాక రైతులు అల్లాడుతుంటే మూలిగే నక్కపై తాటపండుపడినట్లుగా రైతులపై ప్రకృతి విరుచుకుపడుతోంది. అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఆరుగాలం శ్రమించిన పంటలు.. ఈవర్షంతో రైతుకు కన్నీరే మిగిల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట తీవ్రంగా దెబ్బతింది. శుక్ర శనివారాలలో కురిసిన వర్షం, వడగళ్లు, ఈదురు గాలులు తీవ్ర నష్టాన్ని చూకూర్చాయి. వరి పంట కోసి కుప్పలు వేయడంతో ఓదెలు తడిసి ముద్దయ్యాయి. మొక్కజొన్న, పొగాకు పూత దశలో ఉన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షల 50 వేల ఎకరాలలోవరి సాగు చేశారు. పంట అంతా పొట్ట ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు కురవడంతో కంకుల మీద సొంపు రాలిపోయి పొల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెడ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో రైతులు వరి, మిరప, మినుము, మొక్కజొన్న, పొగాకు పంటలను కాపాడుకునేందుకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విభజన అనంతరం ఏలూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ప్రస్తుతం పంట పూత, పిందె దశలో ఉంది. అకాల వర్షాల కారణంగా తామర తెగులు, మచ్చ తెగులు విజృంభించే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, వర్షాలకు మామిడి పూత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాలలో మొక్కజొన్న సాగయింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట గట్టిపడే దశ నుంచి కోత దశకు చేరుకుంది. ఈదురు గాలుల కారణంగా మొక్కజొన్న మొక్కలు పడిపోవటం, కండిలకు బూజు తెగులు వంటి సమస్యలు తలెత్తుతాయి. టి నరసాపురం మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మండలంలోని టి. నరసాపురం, బొర్రంపాలెం, ఏపుగుంట, తదితర ప్రాంతాలలో వడగళ్ల వాన కారణంగా మామిడి, మొక్కజొన్న, పొగాకు తో పాటు నిమ్మ, మిర్చి వంటి పంటలు ఎకరాలలో మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. మినుము పంట ప్రధానంగా కైకలూరు నియోజకవర్గ మండవల్లి, ముదినేపల్లి గ్రామాలలో సాగవుతోంది. జిల్లాలో 30 వేల ఎకరాల్లో మినుము సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాల కారణంగా మినుము రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి, ముదినేపల్లిలో మినుము సాగు చేసిన రైతులు కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. జిల్లాలో 25వేల ఎకరాలలో రైతులు పొగాకును సాగు చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో నాటు పొగాకు కోతలు కోసి పందిళ్ల మీద ఉన్న కారణంగా వర్షం వల్ల పొగాకు తడిసి రంగు మారి నాణ్యత చెడి తీవ్ర నష్టం జరిగింది. పాలిథిన్‌ పరదాలు అద్దెకి తీసుకువచ్చి కప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. పంటంతా కోత కోసి కల్లాల్లో ఉంచారు. రెండు రోజుల వర్షాలకు పంట తడిసి ముద్దయింది. ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు, రేపాక గొమ్మి తదితర గ్రామాల్లో రైతులు పండిరచిన మిర్చిని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వేలేరుపాడు మండలంలో 400 ఎకరాలకు పైగా మిర్చి పంట వర్షం కారణంగా దెబ్బతింది. ఇప్పటికే మిర్చి రైతులు ఎకరాకు రూ.1లక్షకు పైగా పెట్టుబడి పెట్టి వర్షాల కారణంగా రైతులు లబోదిబోమంటున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నారు. చెరువులలో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాటు వైరస్‌ సోకడంతో అనేక రొయ్యలు చనిపోయాయి. వేసవిలో సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. ఇప్పుడు వర్షాలకు చెరువులలో ఏరియేటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. అకాల వర్షం కారణంగా అన్ని పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా సోకే తెగుళ్లపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి పంటను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలుచేసి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విజయనగరం: విజయనగరం జిల్లాలో రబీ సీజన్‌ లో 59, 042 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జామి, రాజాం,సంతకవిటి, గరివిడి, చీపురుపల్లి , వంగర మండలాలకు చెందిన 45 గ్రామాల్లో 869 ఎకరాల మొక్కజొన్న నేలకొరిగింది. మొక్క జొన్న కంకెలు పూర్తిగా తయారుకాని పరిస్థితుల్లో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని తెలుస్తోంది. పంట నష్టపోయిన రైతుల వివరాలను వారం రోజుల్లో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి వి టి రామారావు తెలిపారు. అలాగే ఈ వర్షాలకు ఎస్‌ కోట మండలం లో ముషిడిపల్లి, కిల్లంపాలెం, బొడ్డవర, సీతారాంపురం, గోపాలపల్లి గ్రామాల్లో 40 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే బొబ్బిలి మండలం నారాయణప్ప వలస గ్రామ పరిధిలో ఒక్కొక్క రైతు రెండు,మూడు ఎకరాల మొక్కజొన్న పంట వేశారు. ఎకరాకి పంటకు 20వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడులు పెట్టారని రైతులు చెపుతున్నారు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అకాల వర్ష అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. శనివారం రాత్రి కురిసిన వడగళ్ళ వానకు సత్యసాజిల్లాలోని పెనుకొండ మండలంలోని దుద్దేబండ, ఎర్రమంచి, రాంపురం, గుట్టూరు, మునిమడుగు, వెంకటగిరిపాళ్యం రైతు భరోసా కేంద్రాల పరిధిలో మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెనుకొండ మండల ఆర్బికేల పరిధిలో 131 మంది రైతులకు సంబంధించి 289 ఎకరాల్లో మొక్కజొన్నకు నీటిపాలైంది. సోమవారం నుంచి సంబంధిత రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పుట్లూరు మండలంలోని ఓబుళాపురం, మడ్డిపల్లి, చెర్లోపల్లి, ఎల్లుట్ల, మడుగుపల్లి వివిధ గ్రామాల్లో మొక్కజొన్న, పండ్లతోటలు, అరటి, బొప్పాయి, టమోటా, చినితోటలు, మామిడి తోటలకు లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి పంటల సాగు చేశారు. నోటికాటి కొచ్చిన పంట చేతికి అందకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అరటి మిగతా పంటలకు టన్నుకు దాదాపు రూ.25 వేల నుంచి 30 వెలు మార్కెట్‌లో రేటు ఉన్నందున అప్పులన్నీ తీరుతాయిలే అనుకున్న సమయంలో శనివారం వడగండ్ల వానతో పంటలు పూర్తిగా దెబ్బతిని నేలపాలు కావడంతో రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని వాపోతున్నారు. తక్షణమే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చి, బ్యాంకు రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు జిల్లా కార్యదర్శి జాఫర్‌, సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ ధ్వర్యంలో రైతులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img