Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అన్నిచోట్ల రీపోలింగ్‌ జరపాలి

. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోర వైఫల్యం
. డబ్బు పంపిణీ ఎందుకు… బ మీటనొక్కి ఖాతాలో వేయొచ్చుగా
. జగన్‌పై రామకృష్ణ ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో`తిరుపతి : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతా రీపోలింగ్‌ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఎన్నికలు సజావుగా జరపడంలో రాష్ట్ర ఎన్నికలసంఘం విఫలమైందని విమర్శించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో కలిసి రామకృష్ణ మంగళ వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసనమండలి ఎన్నికలను ఏ ముఖ్యమంత్రి ఇంతగా దిగజార్చలేదని, రాజకీయ బకాసురుడిగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలోనూ గెలవాలన్న దుర్బిద్ధితోనే జగన్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దొంగఓట్ల కోసం చదవని వారికి డిగ్రీ పట్టాలు, పెళ్లి కాని వారికి ఒక్కొక్కరికి పదిమంది భర్తలను సృష్టించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెద్దలసభ ఎన్నికలో అక్రమ సారా అమ్ముకునే వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం, ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయించడం సిగ్గుచేటన్నారు. స్వయానా వైసీపీ నాయకులే పోలింగ్‌ కేంద్రాల వద్ద డబ్బులు పంచుతున్నారని, ఇంతకన్నా జగన్‌ బటన్‌ నొక్కి ఓటర్ల ఖాతాలు డబ్బులు పంపితే సరిపోయేదిగా అని రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలను కలుపుకొని పోరాడతామన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీఎం జగన్‌కు కీలుబొమ్మగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజేంద్రనాథ్‌రెడ్డి వచ్చాక పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
శాసనమండలి ఎన్నికల ప్రక్రియను వైసీపీ పూర్తిగా మార్చేసిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ధ్వజమెత్తారు. తిరుపతిలో వైసీపీ నేతలు భారీగా దొంగఓట్లు వేయించారన్నారు. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై దాడులు చేయడం సరికాదన్నారు. తిరుపతిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపించాలని, కేవలం రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ కంటితుడుపు చర్య అని సుగుణమ్మ మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య అన్నారు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని, దొంగ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని కాంగ్రెస్‌ నాయకులు మాంగాటి గోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీపీఎం నేత బాలసుబ్రహ్మణ్యం అన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గసభ్యులు చిన్నం పెంచలయ్య, జె.విశ్వనాథ్‌, కె.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img