Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అప్పులు, వడ్డీ చెల్లింపుపై శ్వేతపత్రం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అప్పులు, వడ్డీల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ…ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారిందని, 2019తో పోలిస్తే అప్పులు రెండిరతలయ్యాయని రామకృష్ణ వివరించారు. రాష్ట్రం అప్పు రూ.4.42 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి…ఏపీ అప్పు కేవలం రూ.1.35 లక్షల కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్‌లు, తదితరాల ద్వారా చేసిన అప్పుతో కలిపి దాదాపు రూ.10లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షన్‌లు సక్రమంగా చెల్లించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు, వడ్డీ చెల్లింపులపై నిజానిజాలు వెల్లడిరచాలని జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ‘అప్పుచేసి పప్పుకూడు’ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి అటకెక్కిందనీ, నూతన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపించారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, మూడున్నరేళ్లుగా పెండిరగ్‌ బిల్లులు రూ.లక్షా 50వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. నాన్‌ గ్యారంటీ రుణాలు మరో రూ.88 వేల కోట్లకు పైగా ఉన్నాయని, కార్పొరేషన్ల రుణ వివరాలు తెలపాలని కాగ్‌ పదేపదే అడిగినప్పటికీ జగన్‌ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌లో పొందుపరచిన అప్పుల కంటే బడ్జెటేతర అప్పులు ఎక్కువ చేయడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఇప్పటికే రాష్ట్ర రుణ పరిమితి దాటిపోవడం ప్రమాదకర సంకేతమని, అందినకాడికి అప్పులు చేయడం, కేంద్రం విధించే విషమ షరతులకు తలొగ్గి ప్రజలపై భారం వేయడమే పనిగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img