Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అబ్బురపరిచిన గీతాలు… ఆకట్టుకున్న నృత్యాలు

. ఉత్సాహపర్చిన ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు
. తన్మయం చేసిన వందేమాతరం శ్రీనివాస్‌ గీతాలు
. ప్రత్యేక ఆకర్షణగా బోనాల నృత్యం
. మహిళలతో కోలాటమాడిన నాయకులు

విశాలాంధ్ర విజయవాడ: సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల ప్రజా నాట్య మండలి కళాకారుల గీతాలు, నృత్యాలు ఆకటు ్టకున్నాయి. కళారూపాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. బహిరంగ సభ ప్రారంభంలో ‘ఎర్ర జెండా... ఎర్రజెండా... ఎన్నియెల్లో’ అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన పాటకు కూర్చీల్లో నుంచి లేచి తమ చేతుల్లోని ఎర్ర జెండాలను ఊపుతూ, నృత్యం చేస్తూ ప్రజలు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, పార్లమెంట్‌ సభ్యులు వినయ్‌ విశ్వం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వేదిక వద్ద మహిళలతో కలిసి కోలాట ఆడారు. ‘ప్రజా కళాకారులం...’ అన్న చంద్రానాయక్‌ పాట ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ‘ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఏమి జరగలేదంటూ.. ఏమి మిగిలెరో...ఏమి మిగిలెరో..’ అంటూ చిన్నం పెంచలయ్య తన గాత్రం నృత్యంతో ఆకట్టుకున్నారు. ‘శ్రమజీవుల పోరులోనా ఉద్యమాల హోరులోనా..’ అంటూ ఆర్‌.పిచ్చయ్య, ‘అరుణ బాటలో… అరుణ అరుణ బాట నీడలో…’ అంటూ ఎస్‌కే నజీర్‌, ‘మోదీ ఓ పెద్ద కేడీ…’ అంటూ ఎస్‌.గురవప్ప, ‘పిలుస్తుంది.. పిలుస్తుంది… ఎర్రజెండా’ అని వెంకటరాముడు, స్వాతంత్రం మా స్వాతంత్రం… పాటతో, తెలంగాణ ప్రజానాట్యమండలి బృందం ఆగదు ఈ ప్రయాణం అరుణారుణ ప్రస్థానం… అంటూ ఎర్రజెండా పోరాటాలు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శ్యామ్యూల్‌ పాటలు పాడారు. తిరుపతి జిల్లా కార్యదర్శి జె.నాగరాజు ఆధ్వర్యంలో ‘ఆజాదీ ఆజాదీ’ పాటకు చిన్న పిల్లల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ‘పాడవోయి భారతీయుడా..’ గీతానికి రాఘవ శర్మ స్కూల్‌ పిల్లల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నృత్య ప్రదర్శనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న రాయల్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థుల బృందాన్ని మెమెంటో, శాలువాలతో సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. చంద్రానాయక్‌, చిన్నం పెంచలయ్య, గని, ఆర్‌ పిచ్చయ్య , ఎస్‌కే నజీర్‌ , ఎస్‌ గర్రప్ప, మహంత లక్ష్మణరావు , శామ్యూల్‌ , కుమార్‌ , ఎం.సుబ్రమణ్యం, రవి, వెంకట రాముడు, రమణ అప్పన్న, డప్పుసూరి, రాజు, లాలు, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాస్‌, పల్లె నరసింహా, ఉప్పాలయ్య, లక్ష్మీనారాయణ, జగన్‌, గణేష్‌, కొండల రావు, సైదమ్మ ఉత్సాహంగా పాటలు పాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img