Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమరావతిని రాజధానిగా ప్రకటించాలి

అప్పటివరకు భూముల జోలికి వెళ్లే హక్కు ప్రభుత్వానికి లేదు: సీపీఐ నేత రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాజధాని భూముల విక్రయానికి సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ముందు అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అప్పటివరకు రాజధాని భూముల జోలికి వెళ్లే హక్కు ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటివరకు జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపివేసింది. అది ముంపు ప్రాంతమని, శ్మశానమని, ఎడారి అని, నిర్మాణ ఖర్చులెక్కువ అని, అమరావతి రాజధానిగా పనికిరాదని అనేక విధాలుగా దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో మూడు రాజధానుల పాట అందుకున్నారు. అది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరు నూరైనా విశాఖపట్నమే పాలనా రాజధాని అంటూ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కూడా రాజధానిపై హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా, దానిని అమలు చేయడం లేదు. పైగా రాజధాని నిర్మాణానికి అంత ఖర్చు పెట్టలేమని, 60 నెలల సమయం కావాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించకుండా, మరోప్రక్క భూములు అమ్మడానికి సిద్ధం కావడం దుర్మార్గమన్నారు. ఆ భూములు రాజధాని నిర్మాణానికి మాత్రమే ఉపయోగించాలన్న నిబంధనలు ఉల్లంఘించడం క్షమార్హం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అమరావతే ఏపీ రాజధాని అంటూ స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ తర్వాత భూములిచ్చిన రైతులు, అఖిలపక్ష నేతలతో సమావేశమై రాజధాని నిర్మాణపనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి. అప్పటివరకు రాజధాని భూముల విక్రయ ప్రయత్నాలు విరమించుకోవాలని రామకృష్ణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img