Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమరావతి ఇకనైనా కొలిక్కి వచ్చేనా..?

రేపట్నుంచి హైకోర్టులో మళ్లీ రోజువారీ విచారణ
613వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం

అమరావతి : అమరావతి రాజధాని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిపివేశారు. ఆ తర్వాత 2019 డిసెంబర్‌లో సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరిలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది. అప్పటినుంచి రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పద్ధతిలో సుమారు 33 వేల ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చిన రైతులు రోడ్డెక్కి పోరు బాట పట్టారు. గత రాష్ట్ర ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి ఒక్కటే ఏపీకి ఏకైక రాజధాని అని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌తో రైతులు చేస్తున్న ఆందోళన శనివారం 613వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు వారితో కనీస సంప్రదిం పులు జరపలేదు. పైగా రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వేలాది మంది రైతులపై అక్రమ కేసులు బనా యించింది. చివరకు ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీనిపై అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో న్యాయ పోరాటమే శరణ్యమని భావించిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదిం చిన బిల్లులు, వాటిని గవర్నర్‌ ఆమోదించిన విధానంపై దాదాపు వందకు పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. హైకోర్టు మూడు రాజధానుల ఏర్పాటుపై స్టే విధిస్తూ, రైతులు వేసిన పిటిషన్లను రెండు రకాలుగా విభజించి గతేడాది విచారణ ప్రారంభించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించగా, రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దీంతో తమకెం లాంటి సంబంధం లేదని తేల్చేసింది. దీంతో మూడు రాజధానులకు కేంద్రం పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. కొన్ని కార్యాలయాలను పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా, హైకోర్టు అడ్డుపడిరది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ఏ శాఖ కార్యాలయాన్ని తరలించినా, ఆ శాఖా కార్యదర్శి నుంచే ఆ ఖర్చులన్నీ రాబట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల తరలింపు ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే మూడు రాజధానుల బిల్లులు, సీఆర్‌డీఏ రద్దుపై రోజు వారీ విచారణ చేపట్టి కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో గతేడాది నవంబర్‌లో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జె.కె.మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం విచారిస్తున్న మూడు రాజధానుల పిటిషన్ల విచారణ అర్దాంతరంగా నిలిచిపోయింది. ఆయన స్థానంలో సీజేగా వచ్చిన జస్టిస్‌ అరూప్‌ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ రోజు వారీ విచారణ చేపట్టాలని నిర్ణయించిన సీజే ఇందుకోసం ఫుల్‌ బెంచ్‌ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బెంచ్‌ రాజధాని పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి ప్రారంభించబోతోంది. ఈసారైనా రాజధాని అంశం ఒక కొలిక్కి వస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img