Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమరావతి ఉద్యమం @ 800

చట్టపరంగా రైతుల ఘన విజయం
ఇప్పుడు ప్రభుత్వ ధోరణిమార్పుపైనే పోరాటం
రాష్ట్రవ్యాప్త ఉద్యమ ఉధృతికి జేఏసీ నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభించిన అమరావతి రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం మరో మైలు రాయి చేరుకుంది. గురువారానికి 800వ రోజులకు చేరుతుంది. సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన చరిత్రాత్మక ఉద్యమాల్లో అమరావతి ఉద్యమం ఒకటిగా నిలిచిపోతుంది. సహజంగా సమస్యల పరిష్కారానికి పోరాటాలు జరుగుతుంటాయి. ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ప్రభుత్వం కావాలని సమస్య సృష్టించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని విజయవాడగుంటూరు మధ్యలో వస్తుందని, అదీ మూడు పంటలు పండే నదీ తీర భూముల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
ఉచితంగా భూములు ఇచ్చిన రైతులు
రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూమి దాదాపు 34వేల ఎకరాలు ప్రభుత్వానికి ఉచితంగా రైతులు ఇస్తారన్న విషయం మేధావులకు సైతం ఊహకందని అంశం. అప్పటివరకు భూసేకరణ ద్వారా భూ యజమానులకు డబ్బు చెల్లించి తీసుకోవడమే అందరికీ తెల్సుగానీ, భూ సమీకరణ పథకం ద్వారా ఉచితంగా పొందవచ్చన్న విషయం తెలియదు. ఆ పరిస్థితుల్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూసమీకరణ పథకాన్ని ప్రవేశపెట్టి, దానిద్వారా ఇటు ప్రభుత్వానికి, అటు భూములిచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. దీనికి అందరూ ఆకర్షితులయ్యారు. భూములిచ్చిన రైతులకు 15 ఏళ్లపాటు కౌలు ఇవ్వడంతోపాటు, వారిచ్చిన భూమిలో 25శాతం అభివృద్ధి చేసి ఇచ్చేలా సీఆర్‌డీఏ సంస్థ ద్వారా వారికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంటు చేసి భూమిని సమీకరించింది. ముందుగా పాలనా సౌలభ్యం కోసం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు కోసం తాత్కాలిక నిర్మాణాలను చేపట్టింది. శాశ్వత నిర్మాణాలకు కూడా అద్భుతమైన డిజైన్లతో రాక్‌ ఫౌండేషన్‌ కూడా పూర్తి చేసింది. వీటితో పాటు కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు కూడా శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసే ఈ కట్టడాలు తాజ్‌మహల్‌ తరహాలో ప్రపంచస్థాయి పర్యాటక కట్టడాలుగా నిలిచిపోయి ఉండేవి. కృష్ణానదీ తీరాన నిర్మించే అమరావతి రాజధానిని దేశంలోనే పెద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది నాటి ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, వచ్చీ రావడంతోనే అప్పటివరకు శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణపనులు అర్ధాంతరంగా ఆపేశారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ జరిపిందని ఆరోపిస్తూ, ఆ తర్వాత 2019 డిసెంబరు17వ తేదీ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ రోజు నుంచి రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులు అనివార్యపరిస్థితుల్లో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అప్పటినుంచి ప్రారంభించిన రైతుల ఉద్యమం గురువారానికి 800 రోజులవుతుంది. ఇంత సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ ఉద్యమంలో రైతులు ఎదుర్కొన్న ఆటుపోట్లు వర్ణనాతీతం. వీరి ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.
అలుపెరగని పోరాటం
దాదాపు ఆందోళన చేసే రైతులపై ఇప్పటివరకు 3,450 కేసులు నమోదు చేశారు. వీటిలో సుమారు 350 కేసులు దళితులపై ఉన్నాయి. మహిళలపై కూడా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీరంతా గత రెండున్నర సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే, కరోనా తీవ్రతలో సైతం ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నారు. తాతల నాటి భూమిని ప్రభుత్వానికి ఇచ్చి, ఏం చేయాలో దిక్కుతోచక, ప్రశ్నార్థకంగా మారిన తమ బిడ్డల భవిష్యత్‌పై బెంగతో ఇప్పటివరకు దాదాపు 315 మంది రైతులు అసువులు బాశారు.
పాదయాత్రకు అనూహ్య స్పందన
ఇటీవల రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుపతి వరకు నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీలు రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలచాయి. ఈ నేపధ్యంలో మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంది. అయితే మళ్ళీ బిల్లు పెడతామని, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ముందుకే వెళతామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో, రైతులు తమ ఆందోళనను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటివరకు చట్టపరంగా విజయం సాధించిన రైతులు, ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచనా ధోరణి మార్పు కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇకపై దీనిని అన్ని జిల్లాలకు విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్‌, పోతుల బాలకోటయ్య, కొలికపూడి శ్రీనివాసరావు తదరులు లు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img