Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమరావతే రాజధాని

తర్వాతే ఏపీ సీఆర్‌డీఏ చట్టం ఏర్పాటు
కేసు కోర్టులో ఉన్నందున వివరాలు చెప్పలేం
పార్లమెంటు సాక్షిగా కేంద్రం స్పష్టీకరణ

విభజన చట్టం ప్రకారమే నోటిఫై చేశాం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఏపీ రాజధానిపై పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం కొంత స్పష్టత ఇచ్చింది. గతంలో రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెట్టుకోవచ్చని తికమక సమాధానాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం… మొట్టమొదటిసారిగా విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, దాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటీఫికేషన్‌ జారీ చేసిందని వెల్లడిరచారు. ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ పార్లమెంటుకు వివరించింది. 2020లో ఏపీసీఆర్‌డీఏను రద్దుచేసినట్లుగా, మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లు ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు.
అనంతరం ఆ బిల్లును మళ్లీ వెనక్కి తీసుకుంటూ ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని కొనసాగింపుగా మరో బిల్లు ముందుకు వచ్చినట్లుగా మంత్రి వివరించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? అంటూ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా అమరావతి రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున దీనికి సంబంధించి ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొంది. మొత్తానికి అమరావతిపై కేంద్ర చేసిన ప్రకటన గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినట్లైంది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిరదని… దాన్ని మార్చాలంటే మళ్లీ కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, విభజన చట్టంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటన దీనికనుగుణంగా ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img