Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అరెస్టులు, గృహనిర్బంధాలు

. చలో విజయవాడ భగ్నానికి పోలీసుల కుట్ర
. అరెస్టులను ఖండిరచిన రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను, అకృత్యాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ చలో విజయవాడకు బయల్దేరిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి అన్ని జిల్లాల్లో సీపీఐ, అనుబంధ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. చలో విజయవాడకు బయలు దేరిన కడప, అనంతపురం జిల్లాలకు చెందిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులను ముందుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కడప జిల్లా సీపీఐ కార్యదర్శి గాలి చంద్ర, కడప నగర కార్యదర్శి ఎన్‌.వెంకట శివ, నగర సహాయ కార్య దర్శి కేసీ బాదుల్లా, సీపీఐ నాయకులు పి.చంద్ర శేఖర్‌, ఏఐటీయూసీ నాయకులు జి.వేణుగోపాల్‌, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.ఓవయ్య, కె.మునయ్య, టీడీపీ నాయకులు జి.లక్ష్మీరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌ఏ సత్తార్‌, సీఆర్వీ ప్రసాద్‌, ఇన్సాఫ్‌ నాయకులు ఎస్‌కే మైనుద్దీన్‌ తదితరులు ఉన్నారు. అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను, అకృత్యాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి చలో విజయవాడ ప్రారంభం కానుందని రామకృష్ణ తెలిపారు. అన్ని జిల్లాల నుంచి దళిత, మైనార్టీ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. చలో విజయవాడను భగ్నం చేసేందుకు జిల్లాలలో పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాఉద్యమాలను ఆపలేరని స్పష్టంచేశారు. దళితులు, మైనార్టీలకు న్యాయం చేయాలని, డాక్టర్‌ అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ జరపాలని, దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యంను హత్యచేసి డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై కఠినచర్యలు తీసుకోవాలని, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన దుండగులను శిక్షించాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. దాడులు పెచ్చరిల్లుతుంటే జగన్‌ ప్రభుత్వం చోద్యం చూడటం విచారకరమని, అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాతంత్రవాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండిరచాలని రామకృష్ణ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img