Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అలుపెరగని పోరు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి రైతుల ఉద్యమం చరిత్ర పుటల్లో నిల్చిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ప్రారంభమైన అమరావతి ఉద్యమం శుక్రవారానికి 1200 రోజులకు చేరుకుంటుంది. ఈ ఉద్యమ ప్రస్తానంలో రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన వందలాది మంది రైతులు అశువులు బాశారు. ప్రభుత్వం కక్షపూరితంగా బనాయించిన అక్రమ కేసుల్లో వేలాది మంది రైతులు గత నాలుగు సంవత్సరాలుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఈ 1200 రోజుల ఉద్యమ ప్రస్తానంలో ఏ ఒక్కరోజూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన దాఖలాలులేవు. పైగా సమస్యను ఎప్పటికప్పుడు జఠిలం చేసే ప్రయత్నాలు, కుట్రలకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌ కోసం ఉచితంగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం గుర్తించకపోగా, వారిని చులకనగా చూస్తోంది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో వారంతా భూములిచ్చినందున, వారందరినీ టీడీపీ శ్రేణులుగానే సీఎం జగన్‌ భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే రాజధాని ప్రాంతంలో వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ముఖ్యమంత్రి ఊరట చెందలేదు. ఎలాగైనా అమరావతిని విధ్వంసం చేయాలన్న లక్ష్యంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటివరకు శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణపనులన్నింటినీ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చి నిలిపివేశారు. ఆ తర్వాత 2019 డిసెంబరు 17వ తేదీ అసెంబ్లీలో మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్‌ ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి రైతులు రోడ్డెక్కాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిరది. అమరావతి రాజధానిని రక్షించుకోవడం కోసం ప్రారంభించిన రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడిరది. వేలాదిమంది రైతులపై అక్రమ కేసులు బనాయించింది. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా, చివరకు ఎస్సీ రైతులపైనే అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. పోలీసులను ప్రయోగించి ఆందోళనకారులను భయబ్రాంతులకు గురిచేసేలా అరాచకాలు సృష్టించింది. అడుగడుగునా రైతుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మరోవైపు అమరావతిపై అనేక విధాలుగా వైసీపీ పాలక పెద్దలు తప్పుడు ప్రచారాలు చేపట్టారు. రాజధాని భూముల యజమానులంతా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారని, అది అమరావతి కాదు..కమ్మరావతి అని, రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ జరిగిందని, ఇదో పెద్ద భారీ కుంభకోణమని విస్తృత ప్రచారం చేశారు. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టడం వల్ల అభివృద్ధి కేంద్రీకృతమవుతుందని, ఇదంతా ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు భారీ ఖర్చు అవుతుందని, ఇదో శ్మశానం అంటూ రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. అందుకే భవిష్యత్తులో తెలంగాణ తరహా ఉద్యమాలు తలెత్తకుండా మూడు రాజధానుల నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. రాజధాని రైతులు మాత్రం ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, దౌర్జన్యాలకు పాల్పడినా, కుయుక్తులు పన్నుతున్నా వెనకడుగు వేయకుండా, ప్రభుత్వ దమనకాండను సమర్థంగా తిప్పికొడుతూ శాంతియుత మార్గంలో అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నారు. వీరికి విపక్షాలన్నీ అండగా నిలబడుతున్నాయి. బీజేపీ మాత్రం అమరావతికి మద్దతు అంటూనే కేంద్రస్థాయిలో పట్టించుకోకుండా డ్రామాలాడుతోంది. విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అమరావతి రాజధానిని మార్చడానికి వీల్లేదని, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వ అగ్రిమెంటు ప్రకారం రాజధాని ప్లాన్‌ అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని, రైతులిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టు ఆదేశాల ధిక్కరణను తప్పించుకోవడానికి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చివరిరోజు అప్పీలుకు వెళ్లింది.
అక్కడ కూడా ఈ కేసును త్వరగా విచారించాలని సుప్రీంను అభ్యర్థిస్తోంది. దీనిపై కోర్టులో ఏదో ఒకటి తేలిన తర్వాత వచ్చే ఎన్నికల్లోగా కనీసం సీఎం క్యాంపు కార్యాలయమైనా విశాఖలో ఏర్పాటు చేసుకుని తన పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img