Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవినాశ్‌కు చుక్కెదురు

. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన సుప్రీం
. వివేక హత్య కేసు విచారణ గడువు పెంపు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా పేర్కొన్న అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేయగా, ఈనెల 25 వరకు ఆయనను అరెస్ట్‌ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వైఎస్‌ వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగ్గా, సునీత తరపు సీనియర్‌ న్యాయ వాది సిద్దార్థ లూద్రా, అవినాశ్‌ రెడ్డి తరపున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టింది. అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. వివేక హత్యకేసు దర్యాప్తు గడువును జూన్‌-30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్‌ తరపు న్యాయవాది కోరగా… అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాశ్‌ విచారణకుగాను లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని తప్పుబట్టింది. అయినా సీబీఐ అరెస్ట్‌ చేస్తుందని ఎందుకు ఊహించుకుంటున్నారని అవినాశ్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్‌ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసేది కదా అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు పూర్తి సంయమనంతో ఉందని కోర్టు అభిప్రాయపడిరది. ముందస్తు బెయిల్‌ సంగతేంటో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. అవినాశ్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img