Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అవినాశ్‌ పిటిషన్‌పై నేడు మళ్లీ విచారణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం కొద్దిసేపు వాదనలు విన్న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌… ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇంకా గంటల సమయం పడుతుందని న్యాయవాదులు తెలపడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం పూటే వాదనలు వింటామని, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అవినాశ్‌రెడ్డి ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రోజూ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రాతపూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వులను తప్పు పడుతూ తాజాగా విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులిచ్చింది. అయితే ముందస్తు బెయిల్‌కు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత మరలా హైకోర్టు ఏప్రిల్‌ 27,28 తేదీల్లో విచారణ చేపట్టి వాదనలు పూర్తికాకపోవడంతో కోర్టుకి వేసవి సెలవుల దృష్ట్యా జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీం తీర్పు ఆధారంగా విచారణకు హాజరు కావాలంటూ అవినాశ్‌రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసింది. దీనిపై అవినాశ్‌ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని, అలాగే సీబీఐ విచారణను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అయితే ముందస్తు బెయిల్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ను ఈనెల 25న విచారణ చేపట్టి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. ఆమేరకు వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి విచారణ జరిపి, దీనిపై పూర్తిస్థాయి వాదనలు వినేందుకు శుక్రవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img