Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అవినీతిపై ఉక్కుపాదం

నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు

మళ్లీ తెరపైకి ‘సంతానమ్‌’ కమిటీ నివేదిక
1964 నాటి సిఫార్సుల అమలుకు అడుగులు
నిర్ధిష్ట కార్యాచరణకు సిద్ధం కావాలని సీఎస్‌ ఆదేశాలు

అమరావతి : అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిపాలనలో ముందస్తు నిఘా ద్వారా అవినీతి నిర్మూలన కోసం ఒక నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1964 సంతానమ్‌ కమిటీ నివేదిక అమలుకు సిద్ధమయ్యింది. అయితే 2020 సంవత్సరంలో అవినీతికి సంబంధించి ఐఐఎంఅహ్మదాబాద్‌ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పక్కన పెట్టింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు తమ కార్యాలయాల పరిధికి సంబంధించి నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌ దాస్‌ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ వీణా ఇష్‌.. ‘1964కు చెందిన సంతానమ్‌ కమిటీ నివేదికలో గుర్తించినట్లు’గా ముందస్తు నిఘా ప్రాముఖ్యతను వివరిస్తూ మూడు పేజీల నోట్‌ను కూడా జారీ చేశారు. ‘అవినీతిని అరికట్టడం, నిజాయితీ, పారదర్శక, సమర్థవంతమైన, పౌరులకు అనుకూలమైన పరిపాలన’ ఏర్పాటు చేసేందుకే ఈ ప్రయత్నమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి రెవెన్యూ, పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి ‘మోడల్‌ విభాగాలు’గా ఎంపిక చేయబడ్డాయి. అయితే, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి నిర్ధిష్ట సమయమేదీ నిర్దేశించలేదు. ‘నివారణ చర్యలు ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే అవినీతిని నిర్మూలించలేము లేదా గణనీయంగా తగ్గించలేము’ అని సంతానమ్‌ కమిటీ నొక్కి చెప్పింది’ అని విజిలెన్స్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. ‘క్రమబద్ధమైన మెరుగుదలలు, నిర్మాణాత్మక పరిష్కారాల ద్వారా హాని కలిగించే ప్రాంతాలను గుర్తించడం, ప్రస్తావించడం ద్వారా అవినీతి పద్ధతులు జరగకుండా నిరోధించడానికి నిఘా ప్రయత్నిస్తుంది’ అని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ పరిశీలనలను పేర్కొంటూ వీణా ఇష్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో అవినీతిని అరికట్టడానికి అవసరమైన చర్యలపై నివేదికను రూపొందించడానికి ఐఐఎం-ఎ ను నియమించింది. కాగా ఐఐఎంఎ తన సిఫార్సులను 2020 ఆగస్టులో సమర్పించింది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అవినీతి మూల కారణాన్ని తొలగించలేదని గమనించింది. అలాగే, అనేక ఇతర విషయాలతోపాటు ‘విజిల్‌-బ్లోవర్‌ పాలసీ’ని అమలు చేయమని సూచించింది. అక్రమాలు పెద్దవి కావడానికి ముందే వాటిని నివారించడంలో ఇవి సహాయపడతాయని వివరించింది. ‘లిఖితపూర్వకంగా, స్ఫూర్తితో చర్యలు అమలు చేయకపోతే న్యాయమైన, పారదర్శకమైన పాలన ఒక పెదవి సేవగా మిగిలిపోతుంది’ అని ఇది పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఐఐఎం-ఎ నివేదికను ‘మా అంచనాలతో సరిపోలడం లేదు’ అని వెంటనే నిలిపివేసింది. ఇప్పుడు అవినీతిపై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి 1964 సంతానమ్‌ కమిటీ నివేదికను అమలు చేయడానికి సన్నద్ధమయ్యింది. ఈ ప్రక్రియలో నిఘాకు సంబంధించి ప్రభుత్వం దాని స్వంత విజిలెన్స్‌ మాన్యువల్‌లను కూడా మెరుగుపరుస్తోంది. కాగా మాన్యువల్స్‌లో పొందుపరచబడినట్లుగా అనుమానాస్పద అధికారుల జాబితాను తయారు చేయడం, నిర్వహించడం వంటి ప్రాథమిక అంశాలు కూడా విస్మరించబడ్డాయని రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌లో అధికారి ఒకరు ఈ సందర్భంగా ప్రస్తావించారు. శాఖల ప్రణాళికల ఆధారంగా రాష్ట్రం కోసం ముందస్తు నిఘాపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయబడుతుందని ఆయన అన్నారు. ఈ కసరత్తుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img