Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలపై పార్టీలు ఏకం కావాలి : ములాయం

లక్నో : దేశంలో అవినీతి, నిరుద్యోగం, అధిక ధరల సమస్యలపై రాజకీయ పార్టీలు ఏకం కావాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మంగళవారం పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటేనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ములాయం అన్నారు. ఇక్కడ జరిగిన ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌ కార్యక్రమంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌, ఇతర సోషలిస్టు నాయకులు రూపొందించిన ‘రాజ్‌నీతి కే ఉస్‌ పార్‌’ అనే రచనల సంకలనం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశం మొత్తం (రాజకీయ పార్టీల ప్రతినిధులు) ఇక్కడ సమావేశమైనందుకు నేను సంతోషిస్తున్నా.. వారందరినీ ఏకతాటిపైకి తెచ్చినందుకు ప్రొఫెసర్‌ రామ్‌ గోపాల్‌కు ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగం ఈ సమస్యలు ప్రతి ఒక్కరూ దేశ సమస్యలుగా తీసుకోవడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నాయకులతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌, కాగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ ప్రమోద్‌ తివారీ, ఉత్తరప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ రaా, ప్రముఖ జర్నలిస్టు హేమంత్‌ శర్మ, కవి ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీ సభ్యులెవరూ పుస్తకావిష్కరణకు హాజరు కాలేదు. ములాయం మాట్లాడుతూ… ‘దేశం ఎదుర్కొంటున్న సవాల్‌పై అందరం ఐక్యంగా ఉన్నాం.. ఈ స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది..ఎవరూ దీనిని ఆపలేరు..భవిష్యత్తులో దేశానికి గుర్తింపు వస్తుంది’ అన్నారు. ఈ పుస్తకం సోషలిస్టులకే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img