Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అసభ్యంగా తాకేవాడు

బ్రిజ్‌ భూషణ్‌పై మహిళా రెజ్లర్ల ఆరోపణలు

న్యూదిల్లీ: డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యల కోసం రెజ్లర్ల పోరాటం కొనసాగుతోంది. రెజ్లర్ల ఆందోళన శనివారానికి 14వ రోజుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు బ్రిజ్‌ భూషణ్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, కోర్టు, పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని బ్రిజ్‌భూషణ్‌ చెబుతున్నారు. దీని వెనుక ఓ వ్యాపారవేత్త హస్తం ఉందని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం బ్రిజ్‌ భూషణ్‌ తమను అసభ్యంగా తాకినట్లు ఏడుగురు రెజ్లర్లలో ఇద్దరు ఫిర్యాదు చేశారు. ఊపిరి ఎలా తీసుకోవాలో చెబుతూ పొట్ట, ఛాతీ భాగాన్ని అనుచితంగా తాకేవాడని, 2016లో ఓ టోర్నమెంట్‌ సమయంలో రెస్టారెంట్‌లో తన ఛాతీ, పొట్ట భాగాన్ని తాకినట్లుగా ఒక రెజ్లర్‌ చెప్పారు. భయంతో ఆ రాత్రంతా నిద్రపోలేదని ఆమె తెలిపారు. 2018లో తనను కౌగిలించుకున్నాడని మరో రెజ్లర్‌ ఆరోపించారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగించాలని రెజ్లర్లు భావిస్తున్నారు. బజరంగ్‌, సాక్షి మాలిక్‌ దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నారు. బజరంగ్‌, సాక్షి మాలిక్‌, వినేష్‌ ముగ్గురూ దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అందుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఈ అవార్డులు తిరిగిచ్చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img