Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అసెంబ్లీలో అరాచకం

. టీడీపీ ఎమ్మెల్యేలపై అధికారపార్టీ సభ్యుల దాడి
. జీవో 1పై ఆందోళన సమయంలో ఘటన
. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం
. కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత… లైవ్‌ కట్‌
. వెంటనే సభ వాయిదా వేసిన స్పీకర్‌
. టీడీపీ సభ్యులందరిపై మళ్లీ సస్పెన్షన్‌ వేటు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అధికారపార్టీ నేతల అరాచకాలు అసెంబ్లీని సైతం వదలడం లేదు. జీవో 1 రద్దుపై చలో అసెంబ్లీ చేపట్టిన వామపక్షాల ఆందోళనా కార్యక్ర మాన్ని సభ వెలుపల ఉక్కుపాదంతో అణచేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా, అసెంబ్లీ లోపల నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులపై అధికారపార్టీ శాసనసభ్యులు దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యానికి నిలయంగా భావించే శాసనసభ సోమవారం కౌరవసభను తలపించింది. ఈ ఘటన అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే… జీఓ నెం.1 రద్దుకు డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ సభ్యులు దీనిపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిని తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి చర్చకు పట్టు బట్టారు. సభా నిబంధనలు పాటించాలని, ప్రశ్నో త్తరాల సమయంలో ఎలా చర్చిస్తామని టీడీపీ సభ్యు లను స్పీకర్‌ ప్రశ్నించారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ జీవోపై చర్చ పెట్టడమే అన్నింటికంటే ముఖ్యమైన విషయమని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. చైర్‌కు ఏం చేయాలో నిర్దేశిస్తున్నారా? అంటూ టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేసే తమ హక్కులను హరించవద్దంటూ టీడీపీ సభ్యులు అన్నారు. దానిని కాదనడం లేదని, కాని సభ్యులకున్న హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని స్పీకర్‌ హితవు చెప్పారు. బ్రిటీషు కాలం నాటి జీవో 1ని రద్దు చేయా ల్సిందేనని, దీనిపై చర్చించాలని టీడీపీ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ను చుట్టుముట్టారు. వారి చేతుల్లోని అజెండా కాపీలు చింపి స్పీకర్‌పై విసిరేశారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో వారంతా వరుసగా టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. సస్పెండ్‌ కావడం కోసమే ఇలా చేస్తున్నారని, వారి అధినేత చంద్రబాబు ఇంట్లో కూర్చొని వీరిని సభలో రభస చేయమని సూచిస్తున్నారని విమర్శించారు. మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మల్లాది విష్ణు తదితరులు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే అధికారపార్టీ శాసనసభ్యులు కొందరు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకున్నారు. ఈ దశలో టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు తీర్మానాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. ఇంతలో స్పీకర్‌ పోడియం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిని పోడియం కిందకు నెట్టివేస్తూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సీనియర్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో ఉన్న ప్లకార్డు లాక్కుని కిందకు తోసే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ సభ్యులంతా వారిని ప్రతిఘటించడంతో సభలో ఉన్న వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు పరుగులు తీశారు. సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, వెంటనే లైవ్‌ కట్‌ చేశారు. వైసీపీ సభ్యుల దౌర్జన్యంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్‌ పోడియం ముందు బైఠాయించారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము ఏదైనా తప్పు చేసి ఉంటే స్పీకర్‌ చర్యలు తీసుకోవాలి తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయటం ఏమిటని మండిపడ్డారు. అప్పటికే చీఫ్‌విప్‌ సస్పెన్షన్‌కు ప్రతిపాదించడంతో టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించి సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం మార్షల్స్‌తో ప్రతిపక్ష సభ్యులను బైటకు పంపించారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులే తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. వారి దాడిలో తన చేతికి గాయమైందని సభకు తెలియజేశారు. స్పీకర్‌ మొఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి, ఆయనపై కాగితాలు చింపివేసి టీడీపీ సభ్యులు అరాచకం సృష్టిస్తుం డడంతో రక్షణగా వెళ్లామని, తమపైనా దాడికి పాల్పడ్డారని సుధాకర్‌బాబు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
శాసనసభ చరిత్రలో చీకటి రోజు: అచ్చెన్న
తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, సీనియర్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దాడి చేయడం వారి అరాచకాలకు పరాకాష్టగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసు…ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీమంత్రి వెలంపల్లి దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. ‘జీవో 1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం. దానికి స్పీకర్‌ అంగీకరించలేదు. మేం పోడియం దగ్గర నిరసన తెలిపాం. మేం తప్పు చేస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుని మమ్మల్ని సస్పెండ్‌ చేయాలి. పోడియంపైకి వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారు. ఇంతదారుణంగా ప్రత్యక్ష దాడి చేసి వైసీపీ ప్రభుత్వం శాసనసభ పరువు తీసింది. పోడియం వద్దకు వైసీపీ సభ్యులు రావాల్సిన అవసరమేంటి? శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారనే ఆందోళన వైసీపీలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు దాడి చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పైగా మేమే దాడి చేశామని నిస్సిగ్గుగా చెపుతున్నారని, దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలు బయటపెట్టాలని సభ వాయిదా అనంతరం బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి మీడియా ఎదుట డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img