Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అసెంబ్లీలో మళ్లీ రభస

స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన
10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేస్తూనే వస్తున్నారు. శుక్రవారం కూడా బడ్జెట్‌పై చర్చకు సమయం కేటాయింపుపై రభస చోటు చేసుకోవడంతో వరుసగా మూడో రోజు కూడా ప్రతిపక్ష శాసన సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొనేందుకు టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుకు తొలుత అవకాశం ఇచ్చారు. ఆయితే ఆయన మాట్లాడుతూ ఉండగానే పావు గంట తర్వాత ముగించాలంటూ స్పీకర్‌ బెల్‌ కొట్టడం ప్రారంభించారు. సాంబశివరావు ప్రసంగిస్తూ ఉండగానే ఆ తర్వాత మైకు కట్‌ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు తమకు 70 నిముషాలు సమయం ఇస్తానని, పావుగంటకే ఎలా మైక్‌ కట్‌ చేస్తారంటూ ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి బడ్జెట్‌పై మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం చర్చకు పారిపోతోందని, తాము లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సస్పెండ్‌ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. స్పీకర్‌ వారిని సీట్లలో కూర్చోవాలని పదే పదే విజ్ఞప్తి చేసినా, వారు పట్టించుకోకపోవడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సిఫార్సు మేరకు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. బెందాళం అశోక్‌, అచ్చెన్నాయుడు, గణబాబు, రామకృష్ణబాబు, రామరాజు, బాల వీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్‌, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవానీ, చిన్నరాజప్పను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యులకు సభలో కూర్చునే ఓపిక లేదంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే రోజూ గొడవ చేసి బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్‌ తమ్మినేని వివరణ ఇస్తూ టీడీపీకి కేవలం 17 నిముషాలు సమయం మాత్రమే కేటాయించామని, ఆ విషయం వారికి ముందుగానే తెలియజేయగా, చర్చలో ముగ్గురు పాల్గొంటారని తెలియజేసినట్లు వెల్లడిరచారు. తాను ఇంగ్లీషులో చెప్పిన దానిని సెవన్టీ అనుకున్నామని అంటే ఎలా అని ప్రశ్నించారు. సభకు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటిని సభ్యులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పీకర్‌ స్పష్టం చేశారు.
జే ట్యాక్స్‌పై టీడీపీ సభ్యుల ర్యాలీ
జే ట్యాక్స్‌లతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం జలగల్లా పీక్కుతింటుందని ప్ల కార్డులు చేతబూని టీడీపీ శాసన సభ్యులు సభకు హాజరవుతూ ర్యాలీగా వచ్చారు. ఆకాశంలో ధరలు, ఆకలి కడుపులతో పేదలు, నాడు పెట్రోలు రూ.75, నేడు రూ.118, ధరలు తగ్గాలి… దుర్మార్గుడు పోవాలి, జే టాక్స్‌ వల్లే ఏపీ ధరల్లో నంబరు 1 గా ఉందని నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img